Bird Man Of Bihar :కొంతమందికి కొన్ని విషయాలపై ఎనలేని ఇష్టం ఉంటుంది. కొందరికి మొక్కలు పెంచడం ఇష్టమైతే, ఇంకొంతమందికి పక్షులు పెంచడం ఇష్టంగా ఉంటుంది. అలా పక్షులపై ప్రేమను పెంచుకున్న ఓ వ్యక్తి వాటి కోసం తన సమయం అంతా వెచ్చిస్తున్నాడు. ఒకవేళ వివాహం జరిగితే ఈ పక్షులతో ఉన్న బంధం కోల్పోతానేమో అని ఏకంగా ఆ ఆలోచనే పక్కన పెట్టేశాడు. అతనే బీహార్‌లోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంబాగ్లో నివసించే రంజిత్ కుమార్ పాసవాన్.
పక్షులకు దూరం అవ్వాల్సివస్తుందని
రంజిత్ పాసవాన్కు పక్షులంటే విపరీతమైన ప్రేమ. తన ఇంట్లోనే వివిధ జాతుల పక్షులను ఉంచి జాగ్రత్తగా చూసుకునే రంజిత్, జీవిత భాగస్వామి వచ్చిన తర్వాత పక్షులకు దూరం అవ్వాల్సి వస్తుందని, అందుకే పెళ్లి చేసుకోలేదని చెబుతున్నాడు. తన తాత, నాన్నలకు కూడా పక్షుల పెంపకం అంటే చాలా ఇష్టమని, వారి నుంచే తాను ఈ ప్రేమించే గుణాన్ని వారసత్వంగా పొందానని అంటున్నాడు రంజిత్.
రంజిత్ దినచర్య ఎలా సాగుటుందంటే
పొద్దున్న నిద్ర లేచిన వెంటనే రంజిత్ తన బర్డ్‌హౌస్ వైపు వెళ్లి వాటికి ఆహారం అందిస్తాడు. రోజులో ఎక్కువ సమయం వాటి మధ్యే గడుపుతాడు. రంజిత్ వచ్చే అలికిడికి, అతడి గొంతుకు పక్షులు సైతం స్పందిస్తాయి. ఒకవేళ రంజిత్ పనిమీద బయటకు వెళ్లినప్పుడు పక్షులు అతడి కోసం ఎదురు చూస్తాయి. రంజిత్ గొంతు వినగానే సవ్వడి చేసి స్వాగతం పలుకుతాయి. అర్ధరాత్రి అయినా సరే తాము అతడి కోసం ఎదురుచూస్తున్నామన్న భావం వచ్చేలా అలికిడి చేస్తాయి.