Bill to Ban Social Media Under 16 in Florida: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోనే దర్శనమిస్తోంది. వారందరి ఫోన్లలో కనిపించే కామన్ పాయింట్.. సోషల్ మీడియా అకౌంట్స్. అయితే.. చాలా కొద్ది మంది మాత్రమే వాటిని పరిమితంగా వాడుతున్నారు. మిగిలిన వారంతా వాటిలోనే జీవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. రాత్రి పగలనే తేడా లేకుండా.. నలుగురితో కలవకుండా.. ఒంటరిగా కూర్చొని సోషల్ మీడియాతో కాలం గడిపేస్తున్నారు.
దీంతో.. క్రమంగా తమకు తెలియకుండానే సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు. ఇలాంటి వారు ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడి మొదలు.. సూసైడ్ టెండెన్సీతోనూ బాధపడుతున్నారు. కొందరు క్రిమినల్ యాక్టివిటీస్‌కు పాల్పడడం వంటి తీవ్ర చర్యలకూ తెగిస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో తమ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ.. సైబర్ బాధితులుగా మిగిలిపోతున్నారు. ఈ నష్టాలపై అవగాహన లేని టీనేజర్స్.. సోషల్ మీడియా అనే బంధీఖానాలో మగ్గిపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియాకు సంబంధించి ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బిల్లు రూపొందించింది.. దాన్ని పాస్ కూడా చేసింది. దీని ప్రకారం.. 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లను వినియోగించలేరు. ఇప్పటికే సోషల్ మీడియాను వినియోగిస్తున్నవారి ఖాతాలను.. ఆయా సంస్థలు రద్దు చేయాలి. అండర్ ఏజ్ ఉన్న పిల్లలను స్క్రీనింగ్ చేసేందుకు థర్డ్ పార్టీ వెరిఫికేషన్ వ్యవస్థను రూపొందించనున్నారు. ఈ బిల్లును పాస్ చేసిన ఫ్లోరిడా.. గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ సంతకం చేస్తే అది చట్టంగా మారనుంది. విపరీతమైన ఆన్‌లైన్ వినియోగం.. పిల్లల మానసిక స్థితి మీద తీవ్ర ప్రభావం పడుతోందని ఫ్లోరిడా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. బాల్యాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
అయితే.. కొందరు విమర్శకులు మాత్రం ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగంలోని తొలి నిబంధనను ఉల్లంఘిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. అటు.. సోషల్ మీడియా సంస్థలు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ఇన్‌స్టా, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా.. ఈ కొత్త చట్టాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. పిల్లల భవిష్యత్తును ఉద్దేశించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. గవర్నర్‌కు ఈ బిల్లును వీటో చేసే అధికారం ఉంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
సోషల్ మీడియా వినియోగంపై నిపుణుల సూచనలు :