Bihar Road Accident News Today : బిహార్లోని లఖీసరాయ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆటో, లారీ పరస్పరం ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగింది. బాధితులు పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు పోలీసులు.
వివాహ వేడుకకు వెళ్లి వస్తూ!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం-జిల్లాలోని లఖీసరాయ్-సికంద్రా ప్రధాన రహదారికి సమీపంలో బిహరౌరా గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకకు వెళ్లిన 15 మంది ఆటోలో తిరుగు ప్రయాణమవుతున్నారు. ఆ సమయంలో లారీ, ఆటో పరస్పరం ఢీకొన్నాయి. దీంతో అక్కడికక్కడే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
మరణించిన వారిలో వీర్ పాశ్వాన్, వికాస్ కుమార్, విజయ్ కుమార్, దిబానా పాస్వాన్, అమిత్ కుమార్, మోను కుమార్, కిసాన్ కుమార్, మనోజ్ గోస్వామి ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ముంగేర్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించినట్లు పోలీసులు చెప్పారు.
ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. లారీని స్వాధీనం చేసుకున్నామని, డ్రైవర్ పరారయ్యాడని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు అందించినట్లు చెప్పారు.