Bengal Teacher Recruitment Scam :బంగాల్‌లోని కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. 2016లో జరిగిన 25,753 ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో రాష్ట్రస్థాయి ఎంపిక పరీక్ష రాసిన 23 లక్షల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను మళ్లీ మూల్యాంకనం చేయించాలని నిర్దేశించింది.
'12 శాతం వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేయాలి'
అప్పట్లో అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన 25,753 మంది కూడా ఇప్పటివరకు తీసుకున్న వేతనాలను 12 శాతం వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేయాలని తీర్పులో కోర్టు సూచించింది. 9, 10, 11, 12వ తరగతి విద్యార్థులకు వివిధ సబ్జెక్టులను బోధించేందుకు 2016 సంవత్సరంలో గ్రూప్- సీ, గ్రూప్- డీ కేటగిరీల పోస్టులను బంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసింది.
'15 రోజుల్లోగా నియామక ప్రణాళికను సిద్ధం చేయండి'
మళ్లీ కొత్తగా ఆయా పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను మొదలుపెట్టాలని, 15 రోజుల్లోగా నియామక ప్రణాళికను సిద్ధం చేయాలని బంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. దీనిపై సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చని, ఈ కేసులో ఎవరినైనా కస్టడీలోకి తీసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. దీంతో ఎన్నికల వేళ మమతా బెనర్జీ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్లయింది.
ఉద్యోగాల రద్దు చట్టవిరుద్ధం : దీదీ
బంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం మమతా బెనర్జీ, కోల్‌కతా హైకోర్టు తీర్పుపై ఘాటుగా స్పందించారు. ఏకంగా 25,753 మంది ఉద్యోగాలను రద్దు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఈ తీర్పును ఎగువ న్యాయస్థానంలో సవాల్ చేస్తామని వెల్లడించారు. న్యాయవ్యవస్థను, తీర్పులను బీజేపీ నాయకులు ప్రభావితం చేస్తున్నారని దీదీ ఆరోపించారు. 2016లో ఉద్యోగాల్లో భర్తీ అయిన వారంతా గత 8 ఏళ్ల వేతనాన్ని 4 వారాల్లో చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు.