Women Entrepreneurs Loans : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నుంచి మహిళలు, యువతకు శుభవార్తలు వినిపించాయి. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి తొలిసారి వ్యాపారవేత్తలుగా మారిన మహిళలకు రుణ పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా దేశంలోని 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు రాబోయే ఐదేళ్లలో రూ.2 కోట్ల వరకు రుణాలను మంజూరు చేయనున్నారు. తద్వారా వారి వ్యాపారాలకు కేంద్ర సర్కారు ఆర్థికంగా దన్నుగా నిలువనుంది.
దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (SME), భారీ పరిశ్రమల కోసం ప్రత్యేక మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్‌తో ముందుకు సాగుతామని ఆర్థికమంత్రి నిర్మల ప్రకటించారు. ఈ విభాగంలో ఎక్కువగా కార్మికులు అవసరమయ్యే రంగాల ఉత్పాదకతను పెంచేందుకు సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తామని వెల్లడించారు. పరిశ్రమలు తీసుకునే రుణాలకు క్రెడిట్ గ్యారంటీ కవరేజీని రెట్టింపు చేసి రూ.20 కోట్లకు చేరుస్తామన్నారు. ఆయా పరిశ్రమలు చెల్లించే గ్యారంటీ ఫీజును 1 శాతానికి పరిమితమయ్యేలా చేస్తామని నిర్మల తెలిపారు.
'క్రెడిట్ గ్యారంటీ కవరేజీ' అంటే ఏదైనా రుణాన్ని తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే, రుణంలో ఎంత భాగాన్ని మాఫీ చేస్తారో తెలిపే ప్రమాణం. అంటే ఎస్ఎంఈలు, భారీ పరిశ్రమలు ఆర్థికంగా ఏదైనా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటే ఇకపై రూ.20 కోట్ల వరకు రుణమాఫీని పొందొచ్చన్న మాట. బిహార్‌లో 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ'ని ఏర్పాటు చేస్తామని నిర్మల చెప్పారు. 10వేల మందికి ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా 10వేల మంది యువతకు ఐఐటీలు, ఐఐఎస్‌సీలలో సాంకేతిక పరిశోధనల కోసం అవకాశాన్ని కల్పించనున్నారు. ఐఐటీల సామర్థ్యాలను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర సర్కారు చేపట్టనుంది.
ఫుట్‌వేర్, లెదర్ రంగాల్లో 22 లక్షల ఉద్యోగ అవకాశాలు
ఫుట్‌వేర్, లెదర్ రంగాలకు కూడా గుడ్ న్యూస్ వినిపించింది. ఈ రంగాల్లోని పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రత్యేక స్కీమ్‌ను కేంద్ర సర్కారు అమలు చేయనుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. ఆయా పరిశ్రమల టర్నోవర్ రూ.4 లక్షల కోట్లకు, ఎగుమతులు రూ.1.1 లక్షల కోట్లకు పెరుగుతాయన్నారు.
బొమ్మల తయారీ రంగంపై ఫోకస్
బొమ్మల తయారీ విభాగంలో చైనాకు పోటీ ఇచ్చేలా మేడిన్ ఇండియా బ్రాండ్‌ను పైకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేయనుంది. ఇందుకోసం బొమ్మల తయారీ యూనిట్లతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. ఆయా యూనిట్లను నిర్వహించే వారికి శిక్షణ సదుపాయాలను కల్పించనుంది. బొమ్మల తయారీ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చనుంది.
విభిన్నంగా, నాణ్యంగా, వైవిధ్యంగా ఉండే బొమ్మలను తయారు చేసే యూనిట్లను సర్కారు ప్రోత్సహించనుంది. టాప్-50 పర్యటక ప్రదేశాల అభివృద్ధి దేశంలో పర్యాటక రంగం వికాసానికి ప్రత్యేక చర్యలు చేపడతారు. ఇందులో భాగంగా దేశంలోని టాప్-50 పర్యటక ప్రదేశాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తారు. అక్కడ పర్యటకులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను, వసతులను కల్పిస్తారు. తద్వారా ఆయా పర్యటక ప్రదేశాల్లో యువతకు ఉపాధి అవకాశాలు లభించే ఏర్పాట్లు చేస్తారు.