Battle Of former Couple In Bengal : 2024 లోక్‌సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బంగాల్లోని ఓ పార్లమెంట్ స్థానం ఆసక్తికరంగా మారింది. ఒకే లోక్‌సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు బరిలోకి దిగనున్నారు. ఒకరు తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా, మరొకరు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనియాంశంగా మారింది.
బంకురా జిల్లాలోని బిష్ణుపుర్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే సౌమిత్ర ఖాన్‌ను బిష్టుపుర్ నుంచి రంగంలో దింపింది బీజేపీ. టీఎంసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో ఈ స్థానం నుంచి సౌమిత్ర ఖాన్ మాజీ భార్య సూజాత మండల్ పేరు ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుజాత మండల్ టీఎంసీ లోక్‌సభ బరిలో దింపింది.
కెమెరా ముందే విడాకులు
కాంగ్రెస్ నేత సౌమిత్ర ఖాన్, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న సుజాత మండల్‌ను 2010లో పెళ్లి చేసుకున్నారు. మొదట టీఎంసీలో ఉన్న సౌమత్ర ఖాన్, 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అదే సమయంలో సౌమిత్ర తరఫున సుజాత ప్రచారం కూడా చేసింది. తర్వాత 2021లో సుజాత టీఎంసీ పార్టీలో చేరింది. దీంతో అసహనానికి గురైన సౌమిత్ర కెమెరా ముందే సుజాతతో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇక ఇటీవల బీజేపీ, టీఎంసీ వీరిని ఒకే స్థానం నుంచి బరిలోకి దింపాయి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఈ మాజీ భార్యభర్తల పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.