తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అంతా రె'ఢీ'- త్రిముఖ పోరులో గెలుపెవరిదో? - DELHI ASSEMBLY ELECTIONS 2025

దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​కు స్వరం సిద్ధం- ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ- సంక్షేమ పథకాలనే నమ్ముకున్న మూడు పార్టీలు

Delhi Assembly Elections 2025
Delhi Assembly Elections 2025 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2025, 5:24 PM IST

Delhi Assembly Elections 2025 :దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. హస్తినలో ఓట్ల పండుగకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పోలింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. 1.56 కోట్ల మందికిపైగా దిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి భవితవ్యాన్ని తేల్చేందుకు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓట్లు వేయనున్నారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌లో పాల్గొనే సీనియర్ సిటిజన్లు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి కోసం ప్రత్యేకంగా 733 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (QMS) యాప్‌ను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఓటర్లు లైవ్‌లో పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్ల రద్దీపై సమాచారాన్ని చెక్ చేసుకోవచ్చు.

భారీ భద్రతా ఏర్పాట్లు
ఎన్నికల నిర్వహణ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 220 కంపెనీల పారామిలిటరీ దళాలను, 35,626 మంది దిల్లీ పోలీసు సిబ్బందిని, 19,000 మంది హోమ్ గార్డులను ఎన్నికల సంఘం మోహరించింది. దాదాపు 3,000 పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయా ప్రదేశాలలో డ్రోన్‌తో నిఘాతో పాటు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక పోలింగ్ బూత్‌‌లు ఉన్నచోట అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నారు. అక్కడ క్విక్ రియాక్షన్ టీమ్‌లు (QRT) అందుబాటులో ఉంటాయి.

త్రిముఖ పోరు
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్- తన పాలనాపరమైన ఘనతలు, సంక్షేమ పథకాలపై ఆధారపడి మూడోసారి వరుసగా అధికారంలోకి రావాలని యత్నిస్తోంది. 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా దిల్లీ గడ్డపై జయకేతనం ఎగురవేయాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. 2013 వరకు వరుసగా 15 సంవత్సరాలు దిల్లీని ఏలిన కాంగ్రెస్, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ చతికిల పడింది. కనీసం ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. కనీసం ఈసారైనా అధికారంలోకి రావాలని హస్తం పార్టీ భావిస్తోంది.
దిల్లీలో సోమవారం(ఫిబ్రవరి 3న) సాయంత్రం 6 గంటలకు అధికారికంగా ఎన్నికల ప్రచారం ముగిసింది.

మహామహుల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హోరెత్తించారు. ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముమ్మర ప్రచారం చేశారు. ఆప్, బీజేపీని లక్ష్యంగా చేసుకొని వారిద్దరూ విరుచుకుపడ్డారు. దిల్లీలో 'శీష్ మహల్'(కేజ్రీవాల్ అధికారిక నివాసం), యమునా నది నీటి నాణ్యత తగ్గిపోవడం, ఓటర్ల జాబితా ట్యాంపరింగ్, శాంతిభద్రతలు, మహిళా సంక్షేమం వంటి అంశాలను రాహుల్, ప్రియాంక లేవనెత్తారు.

అందరివీ సంక్షేమ అజెండాలే
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పూర్తిగా సంక్షేమ అజెండానే నమ్ముకుంది. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాలు, ఆటో, టాక్సీ డ్రైవర్లకు బీమా, ఆలయ పూజారులు, గురుద్వారా గ్రంధీలకు రూ. 18,000 ఆర్థిక సహాయం అందిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. బీజేపీ సైతం ఇలాంటి పలు హామీలు ఇచ్చింది. గర్భిణులకు రూ.21,000 ఆర్థిక సహాయం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తామని వాగ్దానం చేసింది. నెలకు రూ.8,500 నిరుద్యోగ భృతిని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దిల్లీ ప్రజలు ఏ పార్టీని ఆశీర్వదించారు అనేది ఫిబ్రవరి 8న తెలిసిపోతుంది.

ABOUT THE AUTHOR

...view details