Ajit Pawar Vs Yugendra Pawar Baramati : మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో అబ్బాయ్ యుగేంద్ర పవార్‌పై బాబాయ్ అజిత్ పవార్ విజయం సాధించారు. దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో ఆయనవిజయం సాధించారు. ఎప్పటినుంచో ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న బారామతి, మళ్లీ ఆ పార్టీలోని మరో వర్గానికి పట్టం కట్టింది.
హోరాహోరీ ప్రచారం
అజిత్ పవార్, యుగేంద్ర పవార్ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అజిత్ పవార్- ప్రతి గ్రామానికి తిరిగి సమావేశాలు నిర్వహించారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను గురించి వివరించారు. లోక్‌సభలో శరద్ పవార్‌కు మద్దతిచ్చారు కాబట్టి ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో అజిత్ పవార్‌కు సానుభూతి కూడా తోడైంది.
మరోవైపు, యుగేంద్ర పవార్‌కు శరద్ పవార్ స్వయంగా మద్దతిచ్చారు. ఆయనకోసం ప్రచారం నిర్వహించారు. కొత్తతరం నాయకత్వాన్ని ఆదరించాలని ఓటర్లకు శరద్‌పవార్ విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ 1,81,132 ఓట్లు సాధించి ఘన విజయం సాధించగా, ఆయన సమీప ప్రత్యర్థి అయిన యోగేంద్ర 80,233 ఓట్లు మాత్రమే సాధించగలిగారు.
ప్రతీకారం తీర్చుకున్నారా?
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పవార్ కుటుంబం మధ్య పోరు జరిగింది. బారామతి లోక్‌సభ స్థానంలో అజిత్ భార్య సునేత్ర పవార్ ఓడిపోయారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే గెలుపొందారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో సుప్రియా విజయం సాధించారు. దీనితో యుగేంద్రపై అజిత్ పవార్ గెలిచి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది.
ఎప్పటి నుంచో బారామతి హాట్‌సీట్
పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడి నుంచి శరద్ పవార్, ఆ తర్వాత అజిత్ పవార్ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో తొలిసారి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన శరద్ పవార్ 1990 వరకు ప్రాతినిధ్యం వహించారు. 1991 ఉప ఎన్నిక నుంచి 2019 వరకు అజిత్ పవార్ గెలిచారు. దాదాపు 6 దశాబ్దాల నుంచి పవార్ కుటుంబం కంచుకోటగా ఉన్న బారామతి స్థానంలో ఈసారి ఇరువర్గాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ మరోసారి బరిలో నిలిచారు. వరుసగా ఏడుసార్లు గెలిచిన అజిత్ ఈసారి గట్టి పోటీ ఇచ్చారు. న్సీపీ(ఎస్పీ) తరఫున యుగేంద్ర పవార్ బరిలో నిలిచారు. అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యుగేంద్ర.
2023 జులైలో ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. బాబాయ్ శరద్ పవార్‌పై అబ్బాయి అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగురవేశారు. కొంతమంది ఎమ్మెల్యేలతో బీజేపీ-శివసేన(శిందే వర్గం) కూటమిలో చేరారు.