తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎండిపోతున్న సరస్సుల్లోకి నీరు విడుదల- బెంగళూరు నీటి కొరత తీర్చేందుకు అధికారుల పాట్లు - bangalore water problem

Bangalore Water Crisis : బెంగళూరులో నీటి వృథాను అరికట్టేందుకు కర్ణాటక సర్కారు రంగంలోకి దిగింది. భూగర్భ జలాలను పెంచేందుకు ఎండిపోతున్న సరస్సులను నీటితో నింపాలని నిర్ణయం తీసుకుంది.

Bangalore Water Crisis
Bangalore Water Crisis

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 2:03 PM IST

Bangalore Water Crisis :బెంగళూరులో నీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నీటి ఎద్దడిని తీర్చేందుకు ఎండిపోతున్న సరస్సులను నీటితో నింపనున్నారు. బోర్​వెల్స్​ 50శాతానికి పైగా ఎండిపోయిన తరుణంలో భూగర్భ జలాలను పెంచేందుకు సుమారు 1,300 మిలియన్ లీటర్స్​ పర్ డే (MLD) శుద్ధి చేసిన నీటిని సరస్సుల్లో నింపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సరస్సుల వద్ద సాంకేతికతను ఉపయోగించి వాటర్​ ప్లాంట్స్​, ఫిల్టర్​ బోర్​వెల్స్​ను ఏర్పాటు చేయనున్నామని బెంగళూరు వాటర్​ సప్లై అండ్​ సీవరేజ్​ బోర్డ్​ (BWSSB) తెలిపింది. ఇందుకోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​ సహకారాన్ని తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఫలితంగా సుమారు 20-30 MLD నీరు సరఫరా వ్యవస్థకు చేరుతుందని వెల్లడించారు. కొటే, బెల్లందూర్​, వర్తూర్​, నయందహళ్లి, హెరోహళ్లి, అత్తూర్​, జక్కూర్​ సరస్సుల్లో నీటిని నింపనున్నట్లు BWSSB ఛైర్మన్​ రామ్​ ప్రసాద్​ మనోహర్ తెలిపారు.

బెంగళూరు నగరానికి రోజుకు 2,100 మిలియన్​ లీటర్ల మంచినీరు అవసరం ఉంటుందని, ఇందులో 1,450 మిలియన్ లీటర్లు కావేరీ నది నుంచి వస్తాయని అధికారులు వివరించారు. మిగిలిన 650 మిలియన్ లీటర్లు బోర్​వెల్స్​ నుంచి వస్తాయని, భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల 250 మిలియన్​ లీటర్లు లోటు ఏర్పడుతుందన్నారు. అవసరాలకు సరిపోయేంత నీరు జలాశయాల్లో అందుబాటులో ఉందని చెప్పారు. మార్చి నుంచి మే వరకు నగరానికి 8 టీఎంసీల నీరు అవసరం అవుతుందని, జలశయాల్లో 34 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని తెలిపారు.

హాస్టళ్లలో డిస్పోజల్​ ప్లేట్లు
మరోవైపు నీటి సమస్యను తప్పించుకునేందుకు బెంగళూరులోని హాస్టళ్ల నిర్వాహకులు డిస్పోజల్​ కప్పులు, ప్లేట్లు, గ్లాసులను వినియోగిస్తున్నారు. ఇప్పటికే తమ బోర్​వెల్స్​ ఎండిపోయాయని, ప్రస్తుతం తాము వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నామని హాస్టళ్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్​ చెప్పారు. సుమారు 90శాతం నీరు పాత్రలను శుభ్రం చేయడానికే పోతాయని, అందుకోసమే డిస్పోజల్​ వస్తువులను వాడుతున్నామని వివరించారు. ఉగాదికి కూడా వర్షాలు పడకపోతే, తాము ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు.

తాగునీటిని అందుకు వాడితే రూ.5వేలు ఫైన్​
నీటిని వృథా చేస్తే రూ.5వేలు జరిమానా విధిస్తామని ప్రకటించిన BWSSB, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. తాగునీటిని సాధారణ కార్యకలాపాలకు వినియోగించడాన్ని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని అతిక్రమించిన వారికి రూ.5వేలు జరిమానా వేస్తామని వెల్లడించింది. తాగు నీటిని వాహనాలను శుభ్రం చేయడానికి, రోడ్డు, భవన నిర్మాణం, ఫౌంటెన్​ లాంటి వినోద కార్యక్రమాలకు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. మాల్స్​, సినిమా హాల్స్​ సైతం నీటిని పరిమితంగా వినియోగించాలని సూచించింది. ప్రజలకు తాగు నీటిని అందించడమే ప్రథమ లక్ష్యమని చెప్పింది.

ABOUT THE AUTHOR

...view details