Ayodhya Crowd Status :సరిగ్గా నెలరోజుల క్రితం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. 500 ఏళ్ల రామభక్తుల కల నెరవేరింది. నూతన నిర్మించిన మందిరంలో జనవరి 22వ తేదీన రామచంద్రుడు కొలువుదీరారు. ఆ తర్వాత రోజు నుంచే సామాన్య భక్తులకు రామయ్య దర్శనానికి అనుమతించింది శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్. ఎప్పుడెప్పుడా అని రాఘవుడి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
'ఎన్నో జన్మల పుణ్యఫలమో'
దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు విదేశాలను నుంచి కూడా భక్తులు రామనగరికి వస్తున్నారు. శ్రీరాముడిని దర్శించుకుని పరవశించిపోతున్నారు. జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున కీర్తిస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యఫలమో అంటూ బాలరాముడిని దర్శించుకున్నారు. జనవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు రోజూ అయోధ్య వీధులు కళకళలాడుతున్నాయి. సూర్యోదయం అవ్వగానే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రాముడికి దర్శనానికి వెళ్తూనే కనిపిస్తున్నారు.
60 లక్షలకు మందికిపైగా
ప్రాణప్రతిష్ఠ జరిగిన మొదటి పది రోజుల్లో బాలక్రామ్ను 25 లక్షలకు మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. అంటే రోజుకు సగటున 2.5 లక్షల మంది సందర్శించారన్నమాట. ఆ తర్వాత ఫిబ్రవరిలో రోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది రాము భక్తులు శ్రీరాముడిని దర్శించుకుంటున్నట్లు ఆలయ ట్రస్ట్ కార్యాలయ ఇన్ఛార్జ్ ప్రకాశ్ గుప్తా తెలిపారు. ఇప్పటి వరకు 60 లక్షలకు మందికిపైగా సందర్శించి ఉంటారని ఆయన అంచనా వేశారు.
12 కిలోమీటర్ల దూరం నుంచే సందడి
దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరం నుంచే సందడి కనిపిస్తోంది. అయోధ్య ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారీ పార్కింగ్ స్థలానికి సుదూర ప్రాంతాలను నుంచి భక్తులను తీసుకొచ్చే బస్సులు తరలివస్తూనే ఉన్నాయి. జై రామ్ అంటూ యాత్రికులు కీర్తిస్తూనే ఉంటున్నారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న డార్మిటరీ, లాడ్జి, సత్రాల వద్ద తమ అవసరాలు తీర్చుకుని రామ్ మార్గ్లోకి ప్రవేశిస్తున్నారు.