Aurangabad Goat Theft Case :బిహార్‌లోని ఔరంగాబాద్ సివిల్ కోర్టు మేకల దొంగతనం కేసులో కీలక తీర్పు వెలువరించింది! 36 సంవత్సరాల సుధీర్ఘ విచారణ అనంతరం ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందిలో ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా, ఏడుగురిలో ఇద్దరిని ఇప్పటికే నిర్దోషులుగా తేల్చింది. తాజాగా మరో ఐదుగురిని సైతం నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
అసలేం జరిగిందంటే?
అస్లెంపుర్ గ్రామంలో రాజన్ రాయ్ అనే వ్యక్తి ఇంట్లో 1988 జూన్ 25వ తేదీన తెల్లవారుజామున 5 గంటల సమయంలో దొంగలు పడ్డారు. ఇంటి ముందు కట్టి ఉంచిన రూ.600 విలువ చేసే రెండు మేకలను తీసుకుని వెళ్లారు. మేకల చోరీ విషయం తెలుసుకున్న రాజన్ ఇదే అంశంపై వారిని ప్రశ్నించాడు. దీంతో 12 మంది వ్యక్తులు రాజన్‌పై తిరగబడి దాడి చేశారు. ఇంటికి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో రాజన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే అంశమై రాజన్ 12 మందిపై దౌద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.