Attack On Saif Ali Khan : ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి వెనుక అండర్‌వరల్డ్ హస్తం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అయిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా సైఫ్ ఇంట్లో పనిచేసిన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం 20 బృందాలు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. ముంబయిలో పలువురు ఇన్ఫార్మర్ల సాయంతో నిందితుడికి సంబంధించి సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సైఫ్‌పై దాడి జరిగినపుడు సమీపంలో క్రీయాశీలంగా ఉన్న అన్ని మెుబైల్ ఫోన్ల సాంకేతిక డేటాను సేకరించారు.
పనివాళ్ల ప్రమేయం ఉందా?
ఈ కేసుకు సంబంధించి పలువురిని పోలీసులు విచారిస్తున్నారు. సైఫ్ ఇంట్లో పనిచేస్తున్న వారిని పోలీసులు ఇవాళ బాంద్రా పోలీస్ స్టేషన్‌కు పిలిచి ప్రశ్నించారు. సైఫ్ ఇంట్లో పనిచేసిన కార్పెంటర్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఆయన ఇంట్లో పనిచేసిన అందరినీ పోలీసులు విచారిస్తున్నారని, అందులో భాగంగానే తన భర్తను కూడా పిలిచారని కార్పెంటర్ భార్య చెప్పారు. తన తండ్రి బుధవారం సైఫ్ ఇంటికి పనికివెళ్లాడని ఘటన జరిగింది గురువారమని కార్పెంటర్ కుమారుడు వివరించాడు. మరోవైపు నిందితుడికి సంబంధించిన సీసీటీవీ కొత్త దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అందులో నిందితుడు బ్యాగ్‌తో మెట్లు ఎక్కుతున్నాడు. గురువారం తెల్లవారుజాము అర్థరాత్రి ఒంటిగంట 37 నిమిషాలకు మెట్ల మార్గం ద్వారా నిందితుడి లోపలికి వెళుతున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. ఆ సమయంలో నిందితుడు ముఖానికి ఎరుపు రంగు వస్త్రాన్ని కట్టుకున్నాడు.
నేను సైఫ్ అలీ ఖాన్ - దయుంచి స్ట్రెచర్ తీసుకురండి!
సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ జరిగిన ఘటన గురించి విలేకరులకు వివరించాడు. "నేను బాంద్రాలోని సద్గురు దర్శన్ భవనం వైపుగా వెళ్తున్నాను. ఇంతలో ఓ మహిళ బండి ఆపారు. వెంటనే తెల్ల కుర్తా వేసుకుని, రక్తంతో తడిసి ఉన్న ఓ వ్యక్తి ఆటోలో ఎక్కారు. ఆయన మెడ, వీపుపైన గాయాలు ఉన్నాయి. అతని చేతికి గాయమైన విషయాన్ని అప్పుడు నేను గమనించలేదు. అతనితోపాటు ఓ ఏడు-ఎనిమిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మొదట్లో వాళ్లు హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి వెళ్లాలని అనుకున్నారు. కానీ గాయపడిన వ్యక్తి తనను లీలావతి ఆసుపత్రికి తరలించాలని కోరాడు. దీనితో 7,8 నిమిషాల్లో వారిని ఆసుపత్రికి తరలించాను. అప్పుడు తెల్లవారుజామున సుమారు 3 గంటలు అవుతోంది. వెంటనే గాయపడిన వ్యక్తి గేటు వద్ద ఉన్న గార్డ్‌ను పిలిచి, 'దయచేసి స్ట్రెచర్ తీసుకురండి. నేను సైఫ్ అలీ ఖాన్' అన్నారు. అప్పుడే నేను ఆయన ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ అని గుర్తించాను. సైఫ్‌తో పాటు మరో యువకుడు కూడా ఉన్నాడు. బహుశా అతను సైఫ్ పెద్ద కుమారుడు ఇబ్రహీం అయ్యుంటాడు. ఈ ఇబ్రహీం అలీఖాన్ అమృతా సింగ్ కుమారుడు అయ్యుంటాడు."