Arvind Kejriwal ED Summons :దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీచేసింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 4న తమ ముందు విచారణకు హాజరుకావాలని కోరింది. ఇప్పటివరకు కేజ్రీవాల్‌కు ఏడు సార్లు ఈడీ సమన్లు జారీ చేసినా విచారణకు హాజరుకాలేదు. తాజాగా ఎనిమిదో సారి ఈడీ దిల్లీ సీఎంకు సమన్లు జారీ చేసింది.
'ఇండియా కూటమిని వీడబోము'
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ 8వ సారి సమన్లు జారీ చేయడంపై ఆప్ నేత దిలీప్ పాండే స్పందించారు. 'ఈడీ ఇప్పుడు ఎందుకు అంత నిరాశకు లోనవుతోందో అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పటికే కోర్టులో పెండింగ్‌లో ఉంది. కోర్టు నిర్ణయం కోసం ఈడీ వేచి ఉండలేదా? ఇండియా కూటమి నుంచి ఆప్ బయటకు రావాలని, అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో చూడాలని బీజేపీ కోరుకుంటోంది. ఏం చేసినా మేం ఇండియా కూటమిని వీడబోము' అని తెలిపారు.
ఏడు సార్లు కేజ్రీ గైర్హాజరు
మద్యం కుంభకోణం కేసులో విచారించేందుకు ఈడీ ఇప్పటివరకు ఏడుసార్లు కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 26న ఈడీ సమన్లు ఇచ్చింది. కానీ ఆయన ఒక్కసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు. తాజాగా ఫిబ్రవరి 27న ఎనిమిదో సారి దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.