Arvind Kejriwal Delhi Court Summons : మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దిల్లీలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 16న కోర్టు ముందు అరవింద్ కేజ్రీవాల్ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. కాగా, మనీలాండరింగ్ కేసులో విచారించేందుకు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు పలుమార్లు సమన్లు జారీచేసినా ఆయన హాజరుకావడం లేదని ఈడీ దిల్లీలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టుకు ఈడీ బుధవారం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు దిల్లీ సీఎంకు సమన్లు జారీ చేసింది.
కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు- మార్చి 16న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు - arvind kejriwal ed news today
Arvind Kejriwal Delhi Court Summons : మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. మార్చి 16న దిల్లీలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ముందు హాజరుకావాలని కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది.
Published : Mar 7, 2024, 10:59 AM IST
|Updated : Mar 7, 2024, 12:43 PM IST
మద్యం కుంభకోణం కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఈడీ సమన్లు పంపింది. అయితే వాటిని ఆయన తిరస్కరించారు. ఈ క్రమంలోనే మొదటి మూడుసార్లు సమన్లకు ఆయన స్పందించలేదని ఫిబ్రవరిలో కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పుడు విచారణ జరిపి ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఆ సమయంలో అసెంబ్లీ విశ్వాస పరీక్ష ఉన్నందున వర్చువల్‌గా హాజరైన సీఎం కేజ్రీవాల్ తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఈ అంశం కోర్టులో పెండింగ్ ఉండగానే ఈడీ ఆయనకు మరిన్ని సమన్లు జారీ చేసింది. చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలని పిలవగా కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. అయితే, విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈడీకి సమాధానం పంపారు. మార్చి 12 తర్వాతే వర్చువల్‌గా హాజరవుతానని షరతు విధించారు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం తాజాగా ఆయనకు సమన్లు జారీ చేసింది.
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించింది. ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులోనూ ఆయనకు సమన్లు అందాయి. ఇక ఇదే కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ అరెస్టై జైల్లో ఉన్నారు.