తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లిక్కర్ పాలసీ కేసు- సీఎం కేజ్రీవాల్‌కు మార్చి 28వరకు ఈడీ కస్టడీ - Arvind Kejriwal Arrest - ARVIND KEJRIWAL ARREST

Arvind Kejriwal Arrest : లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్​కు దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మార్చి 28వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇరువర్గాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పునిచ్చారు.

Arvind Kejriwal Arrest
Arvind Kejriwal Arrest

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 8:36 PM IST

Updated : Mar 22, 2024, 10:45 PM IST

Arvind Kejriwal Arrest :మద్యం విధానం కేసులో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను దిల్లీ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 28 వరకు ఆయనను ఈడీ కస్టడీకి అప్పగించింది. మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసిన ఈడీ అధికారులు- శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో భారీ భద్రత మధ్య దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు.

ఈ కేసులో కేజ్రీవాల్‌ను ప్రధాన కుట్రదారుగా పేర్కొంటూ ఆయన్ను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరింది. ఈ అంశంపై రెండున్నర గంటల పాటు వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. ఇరువర్గాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ అంశంపై తీర్పును వెలువరించారు. మార్చి 28న మధ్యాహ్నం 2గంటలకు కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరు పరచాలని ఆదేశించారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు, కేజ్రీవాల్‌ తరఫున అభిషేక్‌ మను సింఘ్వి సహా పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

కోర్టులో మద్యం కుంభకోణం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. "మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్‌పిన్‌. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలుకు సౌత్ గ్రూప్’ సంస్థ నుంచి రూ.కోట్ల ముడుపులు అందుకున్నారు. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్లు డిమాండ్ చేశారు. 45 కోట్లను గోవా ఎన్నికల కోసం వినియోగించారు. హోల్‌సేల్‌ వ్యాపారులకు 12 శాతం, రిటైల్‌ వ్యాపారులకు 185 శాతం వచ్చేలా పాలసీ రూపకల్పన జరిగింది దీని వల్ల 600 కోట్ల లాభాలు అర్జించారు" అని ఈడీ తరఫు న్యాయవాదులు వాదించారు.

కేజ్రీవాల్​ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి?
అనంతరం కేజ్రీవాల్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ సరిగ్గా ఎన్నికల ముందు అందరు ఆప్‌ నేతలు జైల్లో ఉన్నారన్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు లేకుండా గెలవాలని చూస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపిస్తుందన్నారు.కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఆధారాలుంటే కస్టడీ ఎందుకని సింఘ్వీ ప్రశ్నించారు. అప్రూవర్లుగా మారిన వారిని నమ్మాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

కేసు విచారణలో భాగంగా ఈడీ చెప్పిన ముగ్గురు, నలుగురి పేర్లనే మళ్లీ మళ్లీ చెబుతోందని వివరించారు. అరెస్టు చేయగలిగే శక్తి ఉన్నంత మాత్రాన అరెస్టు చేయాల్సిన అవసరం ఉన్నట్లు కాదన్నారు. ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. ఈ కేసును అన్ని కేసుల్లా చూడవద్దని, ఇందులో ప్రజాస్వామ్యానికి సంబంధించిన పెద్ద సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఆప్ అలా- బీజేపీ ఇలా!
అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి పంపుతూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఆమ్​ ఆద్మీ పార్టీ తప్పుపట్టింది. "ప్రతిపక్ష నేతలను పీఎంఎల్‌ఎ కింద ఈడీ అరెస్ట్ చేయడనికి కారణమేమిటంటే- ఈ కేసులో బెయిల్ పొందడం దాదాపు అసాధ్యం" అని దిల్లీ మంత్రి ఆతిషి తెలిపారు. కోర్టు తీర్పుతో విభేదిస్తున్నామని తెలిపారు. మరోవపై,ు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని తెలిపింది.

నా భర్త జీవితం దేశానికే అంకితం: సునీతా కేజ్రీవాల్‌
అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు కావడంపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ స్పందించారు. ప్రధాని మోదీ తనకు అధికార ఉందన్న అహంకారంతో దిల్లీ ప్రజలకు ద్రోహం చేశారని విమర్శించారు. కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ఈమేరకు ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు. "మూడుసార్లు సీఎంగా ఎన్నికైన వ్యక్తిని పీఎం మోదీ అరెస్టు చేయించారు. ప్రజలందరినీ ఆయన అణచివేయాలని చూస్తున్నారు. ఇది దిల్లీ ప్రజలకు ఆయన చేస్తున్న ద్రోహం. మీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ జైల్లో ఉన్నా బయట ఉన్నా ఎప్పుడూ మీతోనే ఉంటారు. ఆయన జీవితం దేశానికే అంకితం. ప్రజలే సర్వోన్నతం. ఆయనకు అన్నీ తెలుసు. జై హింద్‌" అంటూ రాసుకొచ్చారు.

'75 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి'
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ అరెస్ట్ విషయాన్ని ఎన్నికల సంఘాన్ని ఇండియా కూటమి పార్టీల నేతలు తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్​ను కలిసిన తర్వాత మీడియాతో కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వీ మాట్లాడారు. "కేజ్రీవాల్ అరెస్ట్​ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. మీరు(కేంద్రం) ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం వల్ల ఎన్నికలతోపాటు ప్రజాస్వామ్యంపై ప్రభావం పడుతుంది. ఎన్నికల సంఘాన్ని జోక్యం చేసుకోవాలని కోరాం. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో సిట్టింగ్‌ సీఎం అరెస్ట్‌ కావడం ఇదే తొలిసారి. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఖాతాలు స్తంభించపోయాయి. ప్రతిపక్ష నేతలపై ఏజెన్సీల దుర్వినియోగానికి ఆధారాలు ఇచ్చాం. డీజీపీ, సెక్రటరీలను మార్చిన ఎన్నికల సంఘం, ఏజెన్సీలను ఎందుకు నియంత్రించడం లేదు?" అని సింఘ్వీ ప్రశ్నించారు.

సుప్రీం నుంచి వెనక్కి
అంతకుముందు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ చర్యలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉపసంహరించుకున్నారు. ఈ విషయంపై ఆయన దిగువ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రక్రియను సవాల్‌ చేస్తామనీ.. తర్వాత మరో పిటిషన్‌తో సుప్రీంకోర్టుకు వస్తామని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

దేశవ్యాప్తంగా ఆందోళనలు
దిల్లీ సీఎం అరెస్టుకు నిరసనగా ఆప్‌ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. దిల్లీ ఆందోళనల్లో పాల్గొన్న పార్టీ కార్యకర్తలతో పాటు మంత్రులు ఆతిశి, సౌరభ్ భరద్వాజ్‌లను కూడా పోలీసుల అరెస్టు చేశారు. ఐటీవో వద్ద కార్యకర్తలతో కలిసి నిరసనలు చేస్తున్న భరద్వాజ్‌ను పోలీసులు ప్రత్యేక వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భరద్వాజ్‌, కేజ్రీవాల్‌ కుటుంబ సభ్యలను కూడా హౌజ్‌ అరెస్టు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

కేజ్రీవాల్‌ ఓ వ్యక్తి కాదు సిద్ధాంతమని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు. ఆప్‌ శ్రేణులు ఆయన వెంటే ఉన్నాయని చెప్పారు. ఆందోళనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు కృష్ణ మీనన్‌ మార్గ్‌, మోతీలాల్‌ నెహ్రూ మార్గ్‌, జన్‌పథ్‌, అబ్దుల్‌ కలాం రోడ్డు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉంటాయని సూచనలు చేశారు. ఆయా మార్గాల్లో ప్రయాణాలు మానుకోవాలని స్పష్టం చేశారు. పోలీసుల సూచనతో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఐటీవో మెట్రో స్టేషన్‌తో పాటు లోక్‌కల్యాణ్‌ మార్గ్‌ మెట్రోను మూసివేశారు.

అది అవమానించడమే: బీజేపీ
అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతారని ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ప్రజలను, చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ మండిపడింది. కేజ్రీవాల్ తనను తాను చట్టానికి అతీతంగా భావిస్తున్నారా అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన వారు కచ్చితందా జైలుకు వెళతారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని కోరుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్‌తో సహా రాజకీయ నాయకులు గతంలో చేసిన అవినీతి ఆరోపణలను గుర్తు చేస్తున్నారు. అరెస్టు చేసినప్పటికీ ముఖ్యమంత్రిగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్న తొలి సీఎం కేజ్రీవాల్ అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది విమర్శించారు.

Last Updated : Mar 22, 2024, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details