Armstrong Murder Case : తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను కోరారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేసిన అసలైన దోషులను పోలీసులు అరెస్టు చేయలేదని ఆరోపించారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులు ఆందోళన చెందుతున్నారని, వారి భద్రతకు భరోసా ఇవ్వాలని సీఎం స్టాలిన్‌ను మాయావతి కోరారు. కాగా, పెరంబూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆర్మ్‌స్ట్రాంగ్ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి మాయావతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమిళనాడు సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
"ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో న్యాయం జరిగేటట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ చూడాలి. అందుకే ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య చేసిన తీరును చూస్తే తమిళనాడులో లా అండ్ అర్డర్ లేనట్లు అనిపిస్తుంది. అసలైన నిందితులను పోలీసులు పట్టుకోలేదు. ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకోలేదు. అలా అయితే ఇప్పటికే అసలైన నిందితులను అరెస్ట్ చేసి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్మ్‌స్ట్రాంగ్‌కు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాకు లేదు. బహుజన్ సమాజ్ పార్టీ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసును సీరియస్గా తీసుకుంది. మేం మౌనంగా కూర్చొము. పార్టీ కార్యకర్తలు శాంతి భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని మాయావతి వ్యాఖ్యానించారు.