Mangaluru Bank Robbery : కర్ణాటకలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. బీదర్‌లో ఏటీఎంలో డబ్బులు నింపడానికి వెళ్తున్న సిబ్బందిపై కాల్పులు జరిపి, మొత్తం సొమ్ము దోచుకున్న ఘటన మరవక ముందే మరో దారుణం జరిగింది. మంగళూరులో సినీ ఫక్కీలో పట్టపగలే బ్యాంక్ దోపిడీ చేశారు ముసుగు దొంగలు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం- శుక్రవారం మధ్యాహ్నం 11.30 - 12.30 గంటల మధ్యలో కొందరు సాయుధులు ముసుగులు ధరించి మంగళూరు శివార్లలోని కోటెకారు వ్యవసాయ సేవా సహకార బ్యాంక్‌పై దాడి చేశారు. తుపాకులు, కత్తులు, తల్వార్లు చూపించి, బ్యాంక్ సిబ్బందిని బెదిరించి డబ్బులు దోచుకొని కారులో పారిపోయారు. దోపిడీ సమయంలో బ్యాంకులో ఐదుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. దుండగులు 5-6 మంది ఉంటారని, వారందరూ సుమారుగా 25 నుంచి 30 ఏళ్ల వయస్సు వారని తెలుస్తోంది.
"దుండగులు హిందీ, కన్నడ భాషల్లో మాట్లాడారని బ్యాంకు ఉద్యోగులు చెప్పారు. వారు బ్యాంకు సిబ్బందిని బెదిరించి బీరువాలు, అల్మరాలు తెరిపించి విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులు, డబ్బులు దోచుకెళ్లారు. వాటి మొత్తం విలువ సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. నిందితులు నల్లటి ఫియట్ కారులో పారిపోయారు. కేసు నమోదు చేశాం. నిందితులను పట్టుకోవడానికి పోలీసు బృందాలను పంపించాం." అని చెప్పారు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్.
విద్యార్థులను కూడా బెదిరించారు!
'ముసుగు దొంగలు అకస్మాత్తుగా దాడి చేయడం వల్ల బ్యాంక్ ఉద్యోగులు గట్టిగా అరిచారు. అది విని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కొందరు విద్యార్థులు - ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బ్యాంకు కార్యాలయంలోకి వచ్చారు. దీనితో దుండగులు విద్యార్థులను వెనక్కి వెళ్లిపోవాలని కన్నడ భాషలో బెదిరించారు. కానీ బ్యాంకు సిబ్బందితో వారు హిందీలోనే మాట్లాడారు. ముసుగు దొంగలు - బ్యాంక్ సీసీటీవీ రిపేర్ చేయడానికి వచ్చిన ఓ టెక్నీషియన్ ఉంగరాన్ని కూడా దోచుకున్నారు. తరువాత తాము దోచుకున్న సొత్తును ఓ గోనె సంచిలో వేసుకుని అక్కడి నుంచి పారిపోయారు' అని కొందరు సాక్షులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి సమీక్ష
ఈ బ్యాంకు దోపిడీ ఘటన కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ వరకు వెళ్లింది. ఆయన ముఖ్యమంత్రి కార్యక్రమం నుంచి మధ్యలోనే వచ్చేశారు. దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్, వేలిముద్రల నిపుణులు సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. తరువాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ విషయంపై సీనియర్ పోలీస్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.
దుండగులు దోచుకున్న బ్యాంక్ ఇదే! (ETV Bharat)