Amith Shah Fired On Opposition :ఉగ్రవాదం అంతం అయ్యే వరకు పాకిస్థాన్‌తో చర్చలు ఉండవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. రద్దు అయిన 370 అధికరణాన్ని తిరిగి తీసుకువస్తామన్న ప్రతిపక్షాల ప్రకటనలపై షా తీవ్రంగా మండిపడ్డారు. విపక్షాల వైఖరిని వ్యతిరేకించారు. అంతేకాకుండా రాళ్లు రువ్వేవాళ్లను జమ్ముకశ్మీర్‌లో ఎప్పటికీ విడుదల చేయబోమని అన్నారు. ఈ మేరకు ఆదివారం రాఔరీ జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
"ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. ఫరూక్ సాబ్, ఆర్టికల్ 370ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. ఇప్పుడు, బంకర్లు అవసరం లేదు. ఎందుకంటే ఎవరూ బుల్లెట్లు కాల్చడానికి ధైర్యం చేయలేరు. అక్కడి నుంచి బుల్లెట్ వస్తే, ఆ బుల్లెట్‌కు జవాబు బుల్లెట్లతో చెబుతాము. వాళ్లు షేక్ అబ్దుల్లా జెండాను తిరిగి తీసుకురావాలనుకుంటున్నారు. జమ్ముకశ్మీర్‌లో త్రివర్ణ పతాకం మాత్రమే రెపరెపలాడుతోంది. ఇక్కడ 30ఏళ్లుగా ఉగ్రవాదం కొనసాగింది. ఈ 30 ఏళ్లలో 3000 రోజులు కర్ఫ్యూ విధించారు, 40,000 మంది మరణించారు. ఆ రోజుల్లో మీరు ఎక్కడ ఉన్నారు ఫరూక్ సాబ్? కశ్మీర్ కాలిపోతున్నప్పుడు, ఫరూక్ సాబ్ లండన్‌లో హాయిగా సెలవు ఎంజాయ్ చేశారు" అని షా తీవ్రంగా విమర్శించారు.
మేం అలా చేయం!
"కొందరు పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ, ఉగ్రవాదం అంతమయ్యే వరకు వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదు. దేశంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేయాలని వారు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) కోరుకుంటున్నారు. కానీ, మోదీ సర్కార్ అలా ఎన్నటికీ చేయదు. భారత ప్రజలపై రాళ్లు రువ్విన వారికి కారాగారం నుంచి విముక్తి కల్పించేది లేదు" అని షా మరోసారి స్పష్టం చేశారు.
'వారికి రిజర్వేషన్ కల్పిస్తాం'
విపక్షాలు లేవనెత్తిన రిజర్వేషన్ అంశాన్ని అమిత్ షా తన ప్రసంగంలో ప్రస్తావించారు. కాంగ్రెస్, ఎన్సీపీ, పీడీపీ కొండ ప్రాంతాల్లో నివసించే వారికి రిజర్వేషన్లను తీసేశారని, అయినా మోదీ వారికి రిజర్వేషన్ కల్పించేలా చేస్తున్నారని అన్నారు. "కొండ ప్రాంత ప్రజలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు. 'మీ రిజర్వేషన్ తీసేస్తారు' అని ఫరూఖ్ సాబ్ ఇక్కడి గుర్జర్ సోదరులను రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. గుజ్జర్ బకర్వాల్ రిజర్వేషన్ ఒక్క శాతం కూడా తగ్గించబోమని రాజౌలీలో మేము హామీ ఇచ్చాము. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాము. కాంగ్రెస్, NC, PDP మీ రిజర్వేషన్ హక్కులను ఏళ్ల తరబడి హరించాయి" అని అమిత్ షా మండిపడ్డారు.