Jammu and Kashmir Assembly Elections 2024 :మరికొద్ది రోజుల్లో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 10 ఏళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు హామీలు గుప్పిస్తున్నాయి. అందులో ప్రధానమైనది ఉచిత విద్యుత్. జమ్ముకశ్మీర్లో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఉచిత విద్యుత్ వాగ్దానంతో పార్టీలు ముందుకెళ్తున్నాయి. జమ్ముకశ్మీర్లో నెలకొన్న దీర్ఘకాలిక విద్యుత్ కొరతను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని హామీలు ఇస్తున్నాయి. మరి ఈ ఉచిత విద్యుత్ హామీ ఓట్లను రాలుస్తుందా? ఆ హామీ అమలు సాధ్యమేనా? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన స్థానిక పార్టీలు
జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP), అప్నీ పార్టీ ఇలా పలు పార్టీలు ఉచిత విద్యుత్ హామీని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చాయి. జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, పీడీపీ పార్టీలు - గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చాయి. అప్నీ పార్టీ మరో అడుగు ముందుకేసి తాము అధికారంలోకి వస్తే కశ్మీర్లో శీతాకాలంలో, జమ్మూలో వేసవిలో 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని వాగ్దానం ఇచ్చింది. మరి ఈ వాగ్దానాల అమలు విద్యుత్ కొరతతో ఇబ్బందిపడుతున్న జమ్ముకశ్మీర్లో సాధ్యమవుతాయా? అనే అనుమానం పలువురిలో కలుగుతోంది.
ఓట్లను రాబట్టుకునేందుకే!
అస్థిరమైన విద్యుత్ సరఫరాతో విసిగిపోయిన జమ్ముకశ్మీర్ ప్రజల ఓట్లను రాబట్టుకునేందుకు పలు పార్టీలు ఉచిత కరెంట్ హామీని తీసుకొచ్చాయి. ఎందుకంటే శీతాకాలంలో జమ్ముకశ్మీర్ ప్రజలు కరెంట్ సమస్యలతో విసిగిపోతున్నారు. అయితే ఈ హామీల అమలు సాధ్యాసాధ్యాలు అస్పష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన పార్టీలు దాని అమలుపై వివరణాత్మక ప్రణాళికలను వెల్లడించలేదు. మరోవైపు 2023లో తలసరి ఆదాయవృద్ధి పరంగా జమ్ముకశ్మీర్ కేవలం 14.8 శాతం రేటుతో దేశంలో 27వ స్థానంలో నిలిచింది. ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో ఉచిత విద్యుత్ హామీ సాధ్యమేనా? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఉచిత విద్యుత్ సాధ్యమేనా?
జమ్ముకశ్మీర్ గణనీయమైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, దానిలో ఎక్కువ భాగం ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతుందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అందుకే కశ్మీర్లో విద్యుత్ కొరత ఉందని ఆరోపించారు.