AAP MLAs Joined BJP :దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి భారీ షాక్ తగిలింది. ఆప్‌నకు చెందిన 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరిపోయారు. ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు శుక్రవారం రోజే ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఎమ్మెల్యేల్లో కొందరు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు చేయగా, మరికొందరు అసలైన భావజాలం నుంచి ఆప్ దారితప్పిందని విమర్శించారు. బీజేపీలో చేరిన ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నుంచి టికెట్ లభించకపోవడం గమనార్హం.
బీజేపీలో చేరిన ఆప్ ఎమ్మెల్యేల జాబితాలో వందనా గౌర్ (పాలం), రోహిత్ మెహ్రౌలియా (త్రిలోక్ పురి), గిరీశ్ సోని (మాదీపూర్), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), రాజేశ్ రిషి (ఉత్తమ్ నగర్), బి.ఎస్.జూన్ (బిజ్వాసన్), నరేశ్ యాదవ్ (మెహ్రౌలీ), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్) ఉన్నారు. బీజేపీలో చేరిన వెంటనే వీరంతా తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకరుకు పంపారు. తమ శాసనసభ సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు ఆ లేఖల్లో స్పష్టంగా ప్రస్తావించారు.
దిల్లీ 'ఆప్‌ద' నుంచి బయటపడుతుంది: బైజయంత్ పాండా
బీజేపీలో చేరిన వారిలో ఆప్ మాజీ ఎమ్మెల్యే విజేందర్ గార్గ్ సహా పలువురు నేతలు ఉన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, దిల్లీ బీజేపీ ఇంఛార్జ్ బైజయంత్ పాండా, దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సమక్షంలో వీరంతా కాషాయ కండువాలను కప్పుకున్నారు. ఆప్ నేతలకు బీజేపీలోకి బైజయంత్ పాండా స్వాగతం పలికారు. "దిల్లీ రాజకీయాల్లో ఇది చారిత్రక దినం. వాళ్లంతా 'ఆప్‌ద' నుంచి బయటపడ్డారు. ఫిబ్రవరి 5న పోలింగ్ తర్వాత దిల్లీ కూడా 'ఆప్‌ద' నుంచి బయటపడుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. దిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కిస్తారు.