Pinaka Rocket Launcher System :ప్రపంచంలోని అతి శక్తిమంతమైన దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. M51 జలాంతర్గాములు, రాఫెల్ యుద్ధవిమానాలు, లుక్‌లెహ్ శతఘ్నుల వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలను ఫ్రాన్స్ అభివృద్ధి చేసి ఎగుమతులు చేస్తోంది. అలాంటి ఫ్రాన్స్‌ను భారత్‌కు చెందిన ఓ కీలక ఆయుధం అమితంగా ఆకర్షిస్తోంది. అదే పినాక మళ్టీ బ్యారెల్ రాకెట్‌లాంఛర్ ఆయుధ వ్యవస్థ. తమ సైనిక అవసరాల కోసం పినాక మళ్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్లను కొనేందుకు ఫ్రాన్స్ ఆసక్తి చూపిస్తోంది. ఇందుకు భారత్ సహా పినాక వంటి వ్యవస్థను కలిగిన ఇతర దేశాలతో చర్చిస్తున్నట్లు ఫ్రెంచ్ ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ స్టీఫెన్ రిషు తెలిపారు.
పినాక MBRLను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసింది. పినాక నుంచి దూసుకొచ్చిన అనేక రాకెట్లు ఏకకాలంలో 75కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాల్ని ధ్వంసం చేయగలవు. ఇప్పటికే ఆర్మేనియా సహా మరికొన్ని దేశాలు పినాకను కొనుగోలు చేసేందుకు భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. సైనిక సహా అనేక రంగాల్లో సాంకేతికతను పంచుకుంటున్న భారత్-ఫ్రాన్స్‌లు, స్కార్పీన్ వంటి హైఎండ్ సబ్‌మెరైన్లను సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. అమెరికా తర్వాత భారత్ నుంచి పెద్ద మొత్తంలో రక్షణ సామాగ్రిని ఫ్రాన్స్ దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు పినాకను ఫ్రాన్స్ కొనుగోలు చేస్తే- మన మేకిన్ ఇండియా స్కీమ్‌కు అతి పెద్ద విజయం లభించినట్లవుతుంది. ఆకాశ్,155-ఆర్టిల్లరీ గన్స్, పినాక MBRL వంటి పూర్తిస్థాయి ఆయుధాలను భారత్ నుంచి కొనుగోలు చేసే అతిపెద్ద భాగస్వామిగా ఇప్పటికే ఆర్మేనియా అవతరించింది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిస్సైల్, డోర్నియర్-228 ఎయిర్‌క్రాఫ్ట్స్, రాడార్స్, ఆకాశ్‌మిస్సైల్స్, పినాక RL, ఆర్టిల్లరీ వంటి పలు ఆయుధాలనూ భారత్ వివిధ దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తోంది.