ADR Report Fourth Phase Elections :ఎన్నికల సంస్కరణల వేదిక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నాలుగో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించి ఓ నివేదికను విడుదల చేసింది. 1,710 మంది అభ్యర్థుల్లో 21 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ADR పేర్కొంది. మెుత్తం 360 అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వివరించింది. 11 మందిపై హత్య, 30 మందిపై హత్యాయత్నం, 50 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఐదుగురు అభ్యర్థులపై అత్యాచార అభియోగాలు నమోదయ్యాయని తెలిపింది.
మజ్లిస్ ముగ్గురు అభ్యర్థులపై కేసులు
AIMIM తరఫున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో అందరిపై, శివసేన తరఫున బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ADR నివేదిక పేర్కొంది. భారాస తరఫున పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థుల్లో 10 మందిపై, కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న 61 మంది అభ్యర్థుల్లో 35 మందిపై కేసులు ఉన్నాయని తెలిపింది. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న 70 మంది అభ్యర్థుల్లో 40 మందిపై, తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న 17 మందిలో తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. బీజేడీ అభ్యర్థుల్లో ఇద్దరు, ఆర్జేడీ అభ్యర్థుల్లో ఇద్దరు, శివసేన-UBT అభ్యర్థుల్లో ఇద్దరు, వైకాపా అభ్యర్థుల్లో 12 మందిపై కేసులు ఉన్నాయి. టీఎంసీ అభ్యర్థుల్లో ముగ్గురు, సమాజ్‌వాదీ అభ్యర్థుల్లో ఏడుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది.
476మంది కోటీశ్వరులు
క్రిమినల్ కేసులతో పాటు అభ్యర్థుల ఆస్తులను ఏడీఆర్ విశ్లేషించింది. 1,710 మంది అభ్యర్థుల్లో 476 మంది కోటీశ్వరులని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధికంగా రూ.5 వేల కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 24 మంది అభ్యర్థులు అఫిడవిట్‌లో ఆస్తులను ప్రకటించలేదని తెలిపింది.