38 Acres land Donor Rajkumar Jain : మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన 38 ఎకరాల భూమిని దానం చేశారు. విద్యాసంస్థ, సేంద్రీయ విత్తనాల సంరక్షణ కేంద్రం నిర్మించేందుకు రూ.60కోట్ల విలువైన భూమిని దానం ఇచ్చారు. దీంతో భూదాతపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఆయన ఎందుకు ఇలా చేశారంటే?
25 ఏళ్ల క్రితమే నిర్ణయం
సాగర్ జిల్లాకు చెందిన రాజ్ కుమార్ జైన్ 25 ఏళ్ల క్రితమే విద్య, సాంఘిక సంక్షేమం కోసం భూమిని దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దానమివ్వాలనుకున్న భూమి వివాదాల్లో చిక్కుకోవడం వల్ల ఇప్పుడు ఆ కోరిక నేరవేరింది. దీంతో రాజ్ కుమార్ జైన్‌ను అక్కడి వారు బుందేల్‌ఖండ్ బాద్షాతో పోలుస్తున్నారు.
గోశాల కోసం భూదానం
ఆచార్య విద్యాసాగర్ 1998లో సాగర్‌లో పర్యటించారు. అప్పుడు గోశాల నిర్మాణం కోసం భూమిని విరాళంగా ఇచ్చారు రాజ్ కుమార్. అదే స్ఫూర్తితో విద్య, సామాజిక సంక్షేమం కోసం కూడా భూమిని విరాళంగా ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. తాజాగా విద్యాసాగర్ శిష్యురాలైన సుధా సాగర్‌కు 38 ఎకరాల భూమిని ఇచ్చి తన కోరికను నెరవేర్చుకున్నారు.
వివాదంలో భూమి
2000లో రాజ్ కుమార్ జైన్ వేరే వ్యక్తి వద్ద 38 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే న్యాయపరమైన చిక్కుల కారణంగా ఆ భూమి 2004లో రాజ్ కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యింది. భూమిని అమ్మిన వ్యక్తికి పిల్లలు లేకపోవడం వల్ల అతడి బంధువులు ఆ భూమిపై దావా వేశారు. సరిగ్గా అదే సమయంలో కబ్జాదారులు కూడా దానిపై కన్నేశారు. అయితే రాజ్ కుమార్ సుదీర్ఘ న్యాయపోరాటం చేసి భూమిని దక్కించుకుని దానం చేశారు.
పేదల విద్య కోసం!
బుందేల్‌ఖండ్‌లో పేద విద్యార్థుల చదువు కోసం రాజ్ కుమార్ ఇచ్చిన భూమిలో విద్యాసంస్థను నిర్మించనున్నారు. అలాగే సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను ఆకర్షించేందుకు ఆర్గానిక్ బీచ్ కన్జర్వేషన్ సెంటర్ నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు. సామాజిక సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాల కోసం ఈ భూమిలో ఏర్పాట్లు చేయనున్నారు.
"1998లో ఆచార్య విద్యాసాగర్ ఆధ్వర్యంలో గోశాల కోసం భూమి ఇచ్చాను. ఆ తర్వాత విద్యారంగం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. నాకు భూమి అమ్మిన వ్యక్తికి సంతానం లేదు. దీంతో అతని బంధువులు దావా వేశారు. ఆ న్యాయపరమైన చిక్కులన్నీ పూర్తయ్యాయి. భూమిని విద్యాసంస్థ కోసం దానం చేయడం చాలా సంతోషంగా ఉంది."
-రాజ్ కుమార్ జైన్, భూదాత
మొదటి పురుగుల మందు కర్మాగారం
రాజ్ కుమార్ జైన్‌కు నీలేశ్, నితిన్ అనే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఐదుగురు సోదరులు ఉన్నారు. 1986లో సాగర్‌లో రాజ్ కుమార్ మొదటి వ్యవసాయ పురుగుల మందుల కర్మాగారాన్ని ప్రారంభించారు. "మా నాన్న విద్యాసంస్థ కోసం భూమిని విరాళంగా ఇచ్చారు. ఆయన నిర్ణయం పట్ల గర్వంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మేము అలాంటి కార్యక్రమాలకు సహకరిస్తాం. భగవంతుని ఆశీర్వాదం, విద్యాసాగర్ మహారాజ్ కృషి వల్ల భూమికి ఉన్న అన్ని సమస్యలు, అడ్డంకులు తొలగిపోయాయి" అని రాజ్ కుమార్ జైన్ కుమారుడు నీలేశ్ తెలిపారు. అలాగే బుందేల్ ఖండ్‌లో ఉన్నత విద్య కోసం తన తండ్రి కృషి చేస్తున్నారని రాజ్ కుమార్ మరో కుమారుడు నితిన్ ఆనందం వ్యక్తం చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పేరుతో ఇండియాలో ఓ గ్రామం- ఎక్కడంటే?
లాయర్‌గా అదరగొట్టిన ఇంటర్ విద్యార్థి- EWS కోటా కోసం హైకోర్టులో వాదనలు- జడ్జి ఇంప్రెస్!