Liquor Sales in Nalgonda District : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త సంవత్సర వేడుకలను అన్నివర్గాల ప్రజలు ఆనందంగా నిర్వహించుకున్నారు. యువత డిసెంబరు 31 రాత్రి ఒంటి గంట దాటే వరకు రహదారులపై కేరింతలు కొడుతూ కొత్త ఏడాది 2025కి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు రాత్రి పొద్దు పోయే వరకు ఇళ్ల ముందు ముగ్గులు వేశారు.
బైక్‌లపై యువకుల కేరంతలు : నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌తో పాటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో యువత హ్యాపీ న్యూ ఇయర్ 2025 అంటూ కేరింతలు కొట్టారు. పోలీస్ యంత్రాంగం పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినా, కొన్ని ప్రాంతాల్లో యువకులు మద్యం మత్తులో బైక్, కార్లపై పరిమితికి మించి కేరింతలు కొడుతూ రహదారులపైకి వచ్చేశారు. యువకులు కేరింతల వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీస్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
రెండు రోజుల్లో 38.06 కోట్ల ఆదాయం : గత డిసెంబర్ నెలలో ఉమ్మడి జిల్లాలో 4,93,147 కాటన్ల బీరు సీసాలు, 3,72,576 కాటన్ల మద్యం సీసాల అమ్మకాలు జరిగాయి. వీటి ద్వారా రూ.366.92 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. నల్గొండ జిల్లాలో రూ.167.28 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.106.35 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.93.29 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. కేవలం 2 రోజుల్లోనే రూ.38.06 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
భారీ స్థాయిలో మాంసాహారం అమ్మకాలు : దాదాపు 960 చికెన్ షాపుల్లో సుమారు రూ.3.75 కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు సంఘం నాయకులు అంటున్నారు. 550 మటన్ షాపుల్లో రూ.3.50 కోట్లు, చేపలు, ఇతర మాంసాహరం రూ.2.75 కోట్లు, కేకులు, స్వీట్లు ఇతర తినుబండారాలు రూ.5.50 కోట్ల అమ్మకాలు జరిగాయి. శీతల పానీయాలు రూ.3.50 కోట్లు, తాటి కల్లు రూ.80 లక్షల వరకు అమ్మకాలు జరిగినట్లు ఆయా సంఘాల నిర్వాహకులు తెలిపారు.
ఈ న్యూ ఇయర్ 'కిక్కే వేరబ్బా' - వారం రోజుల్లో రూ.1700 కోట్ల మందు తాగేశారు!