Actor Vijay First Political Speech :తనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చని, కానీ పాలిటిక్స్ అంటే భయం లేదని తమిళ నటుడు , తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత దళపతి విజయ్ అన్నారు. రాజకీయం అనేది సినిమా రంగం లాంటిది కాదని, ఇది ఒక యుద్ధభూమి అని చెప్పారు. ఇక్కడ కొంచెం సీరియస్‌గానే ఉంటుందన్నారు. పాము అయినా, రాజకీయం అయినా దానిని సీరియస్‌గా తీసుకోవాలా? లేదా నవ్వుతూ చేతుల్లోకి తీసుకోవాలా? అనేది మనమే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రాజకీయ రంగాన్ని తాను ఎదుర్కోగలనని, నిలదొక్కుకోగలనని విజయ్ తెలిపారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన టీవీకే పార్టీ మొదటి సభ(మానాడు)లో ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రసంగం చేశారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులకు పార్టీ సిద్ధాంతాలను వివరించారు.
కెరీర్‌ని పీక్‌లో వదిలేసి వచ్చా
ఈ సభలో పార్టీ భావజాలాన్ని వెల్లడించిన విజయ్, "ద్రవిడ వాదాన్ని, తమిళ జాతీయ వాదాన్ని వేరు చేయబోము. తమిళనాడుకు ఇవి రెండు కళ్లులాంటివి. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా భావజాలం. దాని ఆధారంగానే పని చేస్తాం. రాజకీయాల్లో ఫెయిల్యూర్స్, సక్సెస్ స్టోరీలు చదివాక, నేను నా కెరీర్‌ని పీక్‌లో వదిలేసి మీ అందరిపై అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి, మీ విజయ్‌గా ఇక్కడ నిలబడ్డాను" అన్నారు.
పిల్లలం కాదు
"రాజకీయాల్లో మమ్మల్ని పిల్లలమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అమితమైన ఆత్మవిశ్వాసంతో మనం సర్పం (రాజకీయం)తో ఆడుకునే పిల్లలం. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని నడిపిస్తాం" అని విజయ్ అన్నారు.
పొత్తులపై క్లారిటీ
భాజపా నిరంకుశత్వంతో వ్యవహరిస్తుందని విజయ్ విమర్శించారు. డీఎంకే ద్రవిడియన్ నమూనాపైనా కూడా ఆయన విరుచుకుపడ్డారు. తన రాజకీయ ప్రయాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. అరియలూరులో నీట్ విద్యార్థిని అనిత ఆత్మహత్య ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఆ పరీక్షపై తన వ్యతిరేక వైఖరిని ఈ సందర్భంగా ప్రకటించారు. తనను ఆర్టిస్ట్ అంటూ పలువురు చేస్తోన్న విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఎంజీఆర్, ఎన్టీఆర్ పేర్లను ప్రస్తావించారు. పొత్తులపై మాట్లాడుతూ ‘‘రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని పూర్తిస్థాయి మెజార్టీతో గెలిపిస్తారని విశ్వసిస్తున్నాం. ఒక వేళ ఏవైనా పార్టీలు పొత్తు పెట్టుకోవాలనుకుంటే, వారికి అధికారంలో భాగస్వాముల్ని చేస్తాం’’ అన్నారు.
సమ సమాజ సాధనే లక్ష్యం!
సభా వేదికపై టీవీకే పార్టీ నేత ప్రొఫెసర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ, తమిళగ వెట్రి కళగం పార్టీ సిద్ధాంతాలు, విధానాలను వివరించారు. ‘‘పుట్టుకతోనే మనుషులంతా సమానం. సమ సమాజాన్ని సృష్టించడమే పార్టీ లక్ష్యం. దీంతో పాటు లౌకికవాదం, రాష్ట్ర స్వయంప్రతిపత్తి, సమ్మిళిత అభివృద్ధి, ద్విభాషా విధానం, అవినీతిపై పోరాటం, తిరోగమన ఆలోచనల తిరస్కరణ, డ్రగ్స్ రహిత తమిళనాడు వంటివి ప్రధాన అంశాలు’’గా పేర్కొన్నారు. అనంతరం మరో నేత కేథరిన్ మాట్లాడుతూ, ‘‘మధురైలో సచివాలయం శాఖ ఏర్పాటు, కుల గణన , విద్యను రాష్ట్ర జాబితాలోకి మార్చేందుకు ఒత్తిడి చేయడం, గవర్నర్ పదవి రద్దుకు ప్రతిపాదన, మూడింట ఒక వంతు స్థానాలు మహిళలకు కేటాయించడం’’ లాంటివి తమ లక్ష్యాలుగా పేర్కొన్నారు.
కిక్కిరిసిన సభాప్రాంగణం
విల్లుపురంలో ఏర్పాటు చేసిన ఈ సభకు లక్షలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు, విజయ్ అభిమానులు హాజరయ్యారు. దీనితో మైదానం కిక్కిరిసిపోయింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని దళపతి విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ద్రవిడ పార్టీలైన అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలతో పాటు బీజేపీని కూడా ఆయన శాసనసభ ఎన్నికల్లో ఎదుర్కోవాల్సి ఉంది.