Accident In Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునికాకు సేకరణకు వెళ్లి తిరిగి వస్తున్న గిరిజనుల వాహనం అదుపుతప్పి 20 అడుగుల గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 19మంది మరణించారు. ఇందులో 17మంది మహిళలతో పాటు డ్రైవర్ ఉన్నాడు. కాగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కుక్డూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహ్పాని గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో సుమారు 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ పరీక్షల కోసం పంపించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
డిప్యూటీ సీఎం సంతాపం
ప్రమాద ఘటనపై చత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు వెల్లడించారు. ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన సాయం చేసేందుకు అధికారులను ఆదేశించామని చెప్పారు.