Shashi Tharoor on EY Employee Death: ఉద్యోగులకు రోజుకు 8 గంటలు చొప్పున, వారానికి 5 రోజులు మాత్రమే పని ఉండాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అభిప్రాయపడ్డారు. వారానికి ఎట్టి పరిస్థితుల్లోనూ 40 గంటలకు మించి పని ఉండకూదని, ఇందుకోసం పార్లమెంట్‌లో చట్టం తెచ్చేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఇటీవల పని ఒత్తిడితో మృతి చెందిన యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగిని అన్నా సెబాస్టియన్ తండ్రిని శశిథరూర్ పరామర్శించారు. రోజుకు 14 గంటల పాటు నాలుగు నెలలు పని చేసి తీవ్ర ఒత్తిడితోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తారు.
"ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రోజుకు 8 గంటలు, వారానికి 5 రోజులకు మించి ఉద్యోగులతో పని చేయించకూడదు. అన్ని పని ప్రదేశాల్లో ఫిక్స్‌డ్ క్యాలెండర్ ఉండాలి. పని ప్రదేశాల్లో మానవహక్కులను అడ్డుకోకూడదు. అమానవీయ చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు, జరిమానాలు విధించేలా చట్టం తీసుకురావాలి. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఉద్యోగులు వారానికి 40 గంటలు పని చేసే అంశాన్ని లేవనెత్తుతా" అని శశిథరూర్ ఎక్స్ వేదికగా తెలిపారు.
యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌లో ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన కోచికి చెందిన అన్నా సెబాస్టియన్ ఈ ఏడాది జులై 20న మరణించారు. పుణెలోని సంస్థ కార్యాలయంలో విధుల్లో ఉండగా అస్వస్థతకు గురైన ఆమెను తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. పని ఒత్తిడే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అన్నా సెబాస్టియన్ తల్లి అనితా ఇటీవల ఈవై ఇండియా హెడ్‌కు రాసిన లేఖ బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది కాస్తా చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన కేంద్రం విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది.
'యువత వారానికి 70 గంటలు పని చేయాలి'
ఇటీవలే యువత వారానికి కనీసం 70 గంటలైనా పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చెప్పడం గమనార్హం. దేశం అభివృద్ధి చెందాలంటే, కచ్చితంగా యువత కష్టపడి పనిచేయాలి. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత జపాన్, జర్మనీ ఇలానే కష్టపడి పనిచేసి, అభివృద్ధి సాధించాయి. అందుకే మన దేశ యువతీయువకులు కూడా ఇలానే పనిచేయాలని సలహా ఇచ్చారు. ఈ సూత్రాన్ని తాను స్వయంగా ఆచరించానని, అందుకే నేటి యువతరానికి ఈ సలహా ఇచ్చినట్లు నారాయణమూర్తి పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.