1200 Voters In One Family In Assam : లోక్‌సభ ఎన్నికల సమరం మొదలైంది. బరిలో నిలిచే అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రచారాలతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసోంలోని ఓ కుటుంబంపై పార్టీ నేతలు దృష్టి పడింది. ఒక కుటుంబమే కదా ఏముందని అనుకుంటున్నారా? ఆ ఒక్క కుటుంబంలోనే 1200 మంది ఓటర్లు ఉన్నారు. ఆ కుటుంబం మొత్తమే ఒక గ్రామంగా ఉంది. అదే అసోంలోని తేజ్‌పుర్ నియోజకవర్గం పరిధిలోని నేపాలీ పామ్ గ్రామం. లోక్‌సభ ఎన్నికల వల్ల ఈ గ్రామం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.
కుటుంబమే గ్రామంగా
రాన్ బహదూర్ అనే గోర్ఖా బ్రిటిష్ కాలంలోనే వచ్చి సోనిత్‌పుర్ జిల్లాలో స్థిరపడ్డారు. వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. అతడికి ఐదుగురు భార్యలు ఉండేవారు. వారికి మొత్తం 12 మంది కుమారులు, 10 మంది కుమార్తెలు. 1997లో రాన్ బహదూర్ మరణించారు. ఇలా విస్తరించిన ఆ కుటుంబ విస్తరించి ప్రస్తుత నేపాలీ పామ్ గ్రామంగా మారింది. మొత్తం 300 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో దాదాపు 2,500 మంది సభ్యులు ఉన్నాయి. వీరిలో 1200 మంది ఓటర్లు ఉన్నారు.