చెట్టుకు కట్టేసి మహిళకు చిత్రహింసలు.. ఆపడానికి వచ్చిన వ్యక్తిని సైతం.. - చెట్టుకు కట్టేసి మహళను కొట్టిన దుండగులు యూపీ
🎬 Watch Now: Feature Video
ఉత్తర్ప్రదేశ్లో అమానవీయ ఘటన జరిగింది. ఓ మహిళను చిత్ర హింసలకు గురిచేశారు కొందరు దుండగులు. చెట్టుకు కట్టేసి తీవ్రంగా దాడి చేశారు. డ్రైనేజీలో పడేసి కొట్టారు. ఆపడానికి వచ్చిన ఓ వ్యక్తిపైనా.. దాడికి తెగబడ్డారు. ఈ దారుణం సంభల్ జిల్లాలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. జున్‌వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖార్క్వారీ గ్రామంలో ఓ మహిళ నివసిస్తోంది. అదే గ్రామనికి చెందిన అశోక్ అనే వ్యక్తి సహాయంతో చిన్న గుడిసె నిర్మించుకుంటోంది. ఇంతలో అక్కడికి చేరుకున్న నిందితులు.. మహిళపై దాడి చేశారు. ఆమెను ఈడ్చుకెళ్లి డ్రైనేజీలో పడేశారు.
అనంతరం కొందరు మహిళలు బాధితురాలిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అక్కడితో ఆగకుండా.. చెట్టుకు కట్టేసి కొట్టారు. మధ్యలో ఆపడానికి వచ్చిన అశోక్ అనే వ్యక్తిపై కూడా దాడి చేసి.. చెట్టుకు కట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.