ఉప్పొంగిన నాలాలో చిక్కుకున్న బస్సు.. 27 మంది.. - Uttarakhand Ramnagar Bus Strucked In Rain Water
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్లో ఎడితెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నైనితాల్ జిల్లాలోని రాంనగర్ పట్టణంలో ఓ నాలా ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న 27 మంది ప్రయాణికులతో కూడిన ఓ బస్సు అదుపు తప్పి కాలువ నీటి ప్రవాహంలో చిక్కుకుంది. బస్సులో ఉన్న వారు కేకలు వేయడం వల్ల అక్కడే ఉన్న కొందరు స్థానికులు అప్రమత్తమయ్యారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పక్కకు ఒరిగిపోయిన బస్సు పైకి ఎక్కి మరి బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ క్రమంలో కాపాడేందుకు బస్సు ఎక్కిన గ్రామస్థుల మధ్య చిన్న తోపులాట కూడా జరిగింది. కాగా, శుక్రవారం మధ్యాహ్నం రాంనగర్ నుంచి డోన్ పరేవాకు 27 మంది ప్రయాణికులతో ఓ బస్సు బయలుదేరింది. సరిగ్గా రాంనగర్ తిల్మఠ్ ఆలయం సమీపంలోకి రాగానే నీటి ఉద్ధృతి పెరగడం వల్ల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. ఇకపోతే రాంనగర్లోనే కాకుండా చుట్టుపక్కల నాలాలు కూడా భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షంతో పాటు వడగళ్ల వాన కూడా కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు రాంనగర్ పట్టణానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 27 మంది ప్రయాణిస్తున్నారని.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక తహసీల్దార్ విపిన్ చంద్ర పంత్ వెల్లడించారు.