ఇబ్బందులు ఎదురైనా సొరంగంలో కలిసికట్టుగా కార్మికులు- వాటర్ పైప్ ద్వారా అధికారులకు సమాచారం! - ఉత్తరకాశి టన్నెల్ ప్రమాదం
🎬 Watch Now: Feature Video
Published : Dec 1, 2023, 5:27 PM IST
Uttarakhand Tunnel Collapse Labour Viral Video : ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియోను టన్నెల్లో ఉన్న సమయంలో ఓ కార్మికుడు చిత్రీకరించారు. సొరంగంలో కార్మికులు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు? గుండె ధైర్యంతో ఎలా కలిసికట్టుగా ఉన్నారు మొదలైన విషయాలను వీడియోలో ఆ వ్యక్తి వివరించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుడు తీసిన వీడియోలో భారీ యంత్ర సామగ్రి కనిపిస్తోంది. వాటితో పాటు టన్నెల్లో కార్మికులందరూ కలిసికట్టుగా ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోను చూస్తే సొరంగంలో కార్మికులు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వారు ధైర్యంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. కార్మికులంతా ఒకే చోట నిద్రచేసినట్లుగా తెలుస్తోంది.
సొరంగంలో ఉన్న సమయంలో నీటిపైపుల ద్వారా తమ సమాచారాన్ని అధికారులకు తెలిపినట్లుగా ఆ ప్రమాదంలో చిక్కుకున్న సంతోష్ అనే ఓ కార్మికుడు తెలిపారు. 'సొరంగంలో పడి ఉన్న రెండు నీటిపైపుల్లో ఓ ఉత్తరం పెట్టాం. తర్వాత పైపులను బిగించి మోటర్‌కు అమర్చి స్టార్ట్ చేశాం. తద్వారా నీళ్లతో పాటు ఉత్తరం కూడా బయటకు వెళ్లింది. దానిని చూసిన అధికారులు సొరంగం లోపల మేమంతా బతికి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఫలితంగా అధికారులు మాకు ఆహార పదార్థాలు, ఆక్సిజన్ పంపించారు. తద్వారా మేం 10 రోజుల పాటు ప్రాణాలతో ఉండగలిగాం' అని ఆ కార్మికుడు వివరించారు.