ఇటుక బట్టీలో ప్రమాదం - వాటర్ ట్యాంక్ గోడ కూలి ఇద్దరు మృతి - bricks factory workers died in kurnool
🎬 Watch Now: Feature Video
Published : Dec 11, 2023, 5:47 PM IST
Two Womens Died due to Water Tank Collapse: ఇటుకల తయారీ కోసం నిర్మించిన నీళ్ల తొట్టి గోడ కూలడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పాణ్యం నియెజకవర్గంలోని ఓర్వకల్లులో ఇటుక బట్టీలో గోడ కూలింది. ఈ ప్రమాదంలో అక్కడే బట్టలు ఉతుకుతున్న ఇద్దరు మృతి చెందారు. ఒక్కసారిగా నీళ్ల తొట్టి గోడ కూలి వీరి మీద పడింది. దీంతో సునీత (30), నందిని(13) అక్కడికక్కడే మరణించారు. మృతులు తెలంగాణ వాసులు. వీరు జీవనోపాధి నిమిత్తం 6నెలలు క్రితం కర్నూలు జిల్లాకు వచ్చారు.
వివరాల్లోకి వెళితే మృతులలో ఒకరు నందిని(13) తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం గుట్ట తండాకు చెందిన బాలిక. ఈమె తల్లిదండ్రులు ఓర్వకల్లు ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. నందిని వారితో కలిసి అక్కడే ఉంటోంది. మరొకరు సునీత(30) గద్వాల్ జిల్లా అయిజ మండలానికి చెందింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త, పిల్లలతో కలిసి జీవిస్తూ ఇటుకల ఫ్యాక్టరీలో పని చేస్తోంది.
ఈరోజు ఉదయం నందిని, సునీత ఫ్యాక్టరీ గోడ పక్కనే బట్టలు ఉతుకుతుండగా, ఫ్యాక్టరీలో ఇటుకల తయారీ కోసం నిర్మించిన నీళ్ల తొట్టి గోడ కూలి మీద పడింది. వెంటనే స్థానికులు వీరిని కర్నూలు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనపై ఓర్వకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.