అక్కడ అబ్బాయి పుడితే మగాళ్లను మహిళలు చితక్కొడతారు.. ఎందుకో తెలుసా..? - భద్రాద్రి కొత్తగూడెంలో డుండ్ పండగ
🎬 Watch Now: Feature Video
Doond Festival Celebrates In Bhadradri Kothagudem: ఆ గిరిజన తండాలో మగపిల్లవాడు పుడితే ఆ తండాలోని మహిళలు పురుషులను కర్రలతో కొడుతూ.. పండుగ జరుపుకుంటారు. ఆ పండగనే "డుండ్ పండగ" అంటారు. ఇది వారికి వంశపారం పర్యంగా వస్తున్న సంప్రదాయం. అయితే ఈ పండగును చూడాలనుకుంటే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కారేపల్లి మండలం సామ్య తండాకు వెళ్లాల్సిందే.. ఈ పండగను ఎందుకు.. ఎలా జరుపుకుంటారో ఒకసారి చూసేద్దామా?
ఈ తండాలో భూక్య అనే ఇంటి పేరుతో గల లంబాడా గిరిజన కుటుంబాలు.. ఇంట్లో మగ పిల్లవాడు పుడితే డుండ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదీ కూడా హోలీ తర్వాత మూడు రోజుల పాటు డుండ్ పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మొదటిరోజు రాత్రి ఆ పిల్లవాడిని ఎత్తుకెళ్లి ఒకచోట భూక్య వంశస్థులు దాచిపెడతారు. ఆ పిల్లవాడితో పాటు ఇంట్లో ఉన్న అరిసెల మూటను కూడా దాచిపెడతారు. గ్రామస్థులంతా వాటిని వెతికి పట్టుకుని.. ఆ పిల్లవాడికి పేరు పెడతారు.
రెండోరోజు.. మొదటిరోజు కార్యక్రమం ప్రారంభానికి ముందు పాతిన చాందిని అనే స్తంభం వద్ద పాయసం, అన్నం వండి నైవేద్యం పెట్టి మహిళలు.. భర్తలను, మరిది వరస అయిన వ్యక్తులను కర్రలతో కొడతారు. వారు మహిళల నుంచి తప్పించుకుని తిరుగుతారు. ఆ తర్వాత ఆ స్తంభం వద్ద ఉంచిన నైవేద్యాన్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. వారిని మహిళలు అడ్డుకుంటారు. ఈ తంతు అంతా సంప్రదాయంగా నిర్వహిస్తారు.