SRSP Water Level : ఎగువ నుంచి వస్తోన్న వరద.. 25 టీఎంసీలకు చేరిన ఎస్సారెస్పీ నీటి నిల్వ - Nizamabad District News
🎬 Watch Now: Feature Video
Sri Ram Sagar Project Present Water Level : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద క్రమక్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 36,175 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. గోదావరి నుంచి 31,825 క్యూసెక్కులు.. రివర్స్ పంపింగ్ ద్వారా 4,350 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1068 అడుగుల నీటిమట్టంతో.. 25 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీరాంసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. మొత్తం 42 గేట్లు ఉన్నాయి.
వర్షాభావ పరిస్థితుల్లో శ్రీరాంసాగర్‌కు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలించేందుకు శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని వెనక్కి తీసుకువచ్చి.. వరద కాలువ ద్వారా నీటిని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు మళ్లిస్తున్నారు. ఎస్సారెస్పీ వరద కాల్వపై మూడు పంపుహౌజ్‌లు నిర్మించారు. వరద కాలువ 73 కిలోమీటర్ల వద్ద రాంపూర్, 34 కిలోమీటర్ల వద్ద రాజేశ్వర్రావు పేట, 0.1 కిలోమీటర్ల వద్ద ముప్కాల్ పంపుహౌజ్‌లు నిర్మించారు. ఒక్కో పంపుహౌజ్‌లో 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎనిమిది చొప్పున మోటార్లు బిగించారు.