టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ.. పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఎలా? - పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఎలా
🎬 Watch Now: Feature Video
Prathidwani : ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంశం... టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతం. ఈ టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ కమిషన్ కార్యాలయం వద్ద రెండు రోజుల నుంచి నిరసనలు మిన్నంటాయి. పోటీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష పేపర్‌ను కమిషన్ సిబ్బందే లీక్ చేయటంపై.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. నిరుద్యోగ, విద్యార్థి వర్గాల్లో ఇది సృష్టించిన కలకలం అంతాఇంతా కాదు. మరీ ముఖ్యంగా.. కలల కొలువులే లక్ష్యంగా నిద్రాహారాలు మాని.. గంపెడాశలతో పుస్తకాలతో కుస్తీపడుతున్న లక్షలాది మందిలో పెద్ద అలజడికే కారణమైంది.
ఏదో ఒక కారణంతో తరచు ఎందుకు వార్తల్లోకి టీఎస్‌పీఎస్సీ రావడం ఆందోళనలకు మరింత ఆజ్యం పోస్తుంది. దాంతో ఈ ఉదంతం తెలంగాణ వ్యాప్తంగా మరింత ఉద్దృతమవుతోంది. లీకేజీ వ్యవహారాన్నినడిపించిన నిందితుల నిర్వాకాలూ విస్తుబోయేలా చేశాయి. కొంతకాలంగా అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న తరుణంలో... గతంలో జరిగిన ఎన్నో లీకేజీ ఘటనల చేదు జ్ఞాపకాల్ని మళ్లీ కళ్ల ముందుకు తెచ్చాయి ఈ పరిణామాలు. ప్రస్తుత పరీక్షా విధానంలో ఉన్న లోపాలను సరిచేసి.. ఎటువంటి పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే ప్రయోజనకరం ? మరి.. రాష్ట్ర యువతరం రేపటి ఆశలు, ఆకాంక్షలతో ముడిపడి ఉన్న పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.