తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దుండగుల దాడి - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అంటే తెలంగాణలో చాలా మందికి సుపరిచితమే. ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడూ ప్రశ్నిస్తుంటారు. తీన్మార్ మల్లన్న నడుపుతున్న క్యూ న్యూస్ ఛానల్‌పై ఇవాళ దాడి జరిగింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న తీన్మార్ మల్లన్నకు సంబందించిన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆదివారం కావడం వల్ల కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. కొంత మంది వ్యక్తులు అక్రమంగా కార్యాలయంలోకి ప్రవేశించి ఆఫీసులో ఉన్న క్యాబిన్లను, అద్దాలను, కంప్యూటర్లను ఇతర ఫర్నిచర్ ను అంతా ధ్వంసం చేశారు. కార్యాలయాన్ని అంతా చిందరవందర చేసిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దాడి సమయంలో మల్లన్న అక్కడ లేరు. ఈ ఘటనపై కార్యాలయ సిబ్బంది, మల్లన్న అనుచరులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.