ఒక్కసారిగా కూలిన స్వింగ్ టవర్.. ఎగ్జిబిషన్‌కు వెళ్లిన 40 మందికి..
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అజ్మీర్ జిల్లాలో ఏర్పాటుచేసిన ఓ ఎగ్జిబిషన్‌లో స్వింగ్ టవర్ కూలింది. ఈ ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. వారందరినీ సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన స్వింగ్ టవర్.. గుండ్రంగా తిరుగుతూ పైకి కిందికీ వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. టవర్ వైరు తెగిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వారు వెల్లడించారు. ఒక్కసారిగా స్వింగ్ టవర్ పైనుంచి కుప్పకూలిందని.. దీంతో అక్కడ ఉన్న వారమంతా తీవ్ర ఆందోళనకు గురయ్యామని ఆ సమయంలో ఎగ్జిబిషన్‌లో ఉన్నవారు చెబుతున్నారు. భయంతో పరుగులు తీశామని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
"ఈ టవర్ 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. 20 నుంచి 25 అడుగుల పైనుంచి టవర్ కింద పడింది. ప్రమాద సమయంలో 35 నుంచి 40 మంది.. స్వింగ్ టవర్‌లో రైడింగ్ చేస్తున్నారు." అని సందర్శకులు తెలిపారు. ఘటన అనంతరం అక్కడ ఉన్న వారు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. చాలా మందికి.. వీపుకు, ముఖానికి గాయలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎగ్జిబిషన్ నిర్వహకులు అక్కడి నుంచి పారిపోయినట్లు బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో 80 వరకు స్టాల్స్ ఉంటాయని సందర్శకులు చెబుతున్నారు. ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఓ అధికారి తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఆయన వెల్లడించారు.