కాపలా కాయకుండా కాలక్షేపం చేశారు - ఆ దొంగ తప్పించుకొని పారిపోయాడు - సూరారంలో పోలీసుల నుంచి తప్పించుకున్న దొంగ
🎬 Watch Now: Feature Video


Published : Dec 16, 2023, 5:16 PM IST
Suraram Thief Escaped From Police : సూరారంలో పోలీసుల నిర్లక్ష్యం వల్ల కళ్ల ముందే ఉన్న దొంగ తప్పించుకుని పారిపోయాడు. శుక్రవారం సాయంత్రం దొంగతనం చేసి పారిపోయే క్రమంలో చెరువులోకి దూకిన దొంగను పోలీసులు చేతులారా వదిలేశారు. సూరారం పోలీస్స్టేషన్ పరిధిలోని నివాసం ఉంటున్న నందు కుటుంబం ఫంక్షన్కు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి వారింట్లో చోరీకి వచ్చాడు. సాయంత్రం వారి కుమార్తె వచ్చి చూసేసరికి ఇల్లంతా చిందరవందర చేసి, దొంగ తాపీగా కూర్చోని డబ్బులు లెక్కిస్తూ కన్పించాడు.
దీంతో ఆ బాలిక కేకలు వేసింది. చుట్టుపక్కలవారు వచ్చి అతన్ని వెంబడించడంతో చెరువులోకి దూకి మధ్యలో ఉన్న రాయిపై నిల్చున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని బయటికి రమ్మని చెప్పినా రాలేదు. రాత్రి 10గంటలు గడుస్తున్నా దొంగను బయటకు రప్పించే ప్రయత్నం చేయలేకపోయారు. దొంగ ఉన్నాడా లేదా అనేది చూడకుండా, విధులను గాలికి వదిలేసి కాలక్షేపం చేశారు. తెల్లారే సరికి దొంగ పోలీసుల కళ్లుకప్పి తప్పించుకోవడంతో, సదరు ఇంటి యజమాని నిందితుడిని చేజేతులా వదిలేశారని వాపోయారు. కష్టపడి సంపాదించుకున్న తన సొమ్మంతా కళ్ల ముందే మాయమైందని లబోదిబోమన్నారు.