కాలేజీలో ఈవెంట్.. సింగర్పైకి దూసుకొచ్చిన డ్రోన్.. నొప్పితో విలవిలలాడుతూ!
ప్రముఖ నేపథ్య గాయకుడు బెన్నీ దయాల్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడు.. చెన్నైలోని ఓ కళాశాల మ్యూజిక్ కన్సెర్ట్‌లో పాల్గొన్న ఆయన స్పల్పంగా గాయపడ్డారు. వేడుకను షూట్ చేస్తున్న ఓ డ్రోన్.. అతడిపై ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో వేదికపై తడబడి ఆయన కింద పడిపోయారు. వెంటనే గమనించిన సిబ్బంది.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయతే తన ఆరోగ్యంపై బెన్నీ దయాల్.. ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. "శుక్రవారం నేను షోలో పాడుతూ ఉండగా డ్రోన్ కెమెరా ఒక్కసారిగా నావైపు దూసుకొచ్చింది. నా మెడ వెనుకభాగంలో తగిలింది. దీంతో స్వల్పంగా రక్తస్రావం అయింది. డ్రోన్‌ను నిలువరించే క్రమంలో చేతి వేళ్లకు గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాను. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. నా ఆరోగ్యం గురించి అడిగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము గాయకులం. మాకు పెద్ద నటుల్లా భారీ ఏర్పాట్లు అవసరం లేదు. సాధారణ ఏర్పాట్లు సరిగ్గా చేస్తే చాలు అని షో నిర్వాహకులకు చెప్పాలనుకుంటున్నాను" అని బెన్నీ దయాల్ తెలిపారు.