Siddipet ST Gurukul Hostel Viral Video : విద్యార్థులతో వంట పనులు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
🎬 Watch Now: Feature Video
Siddipet ST Gurukul Hostel Viral Video : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎస్టీ గురుకులం హాస్టల్లో పిల్లల చేత రొట్టెలు, చపాతీలు చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లల చేత చపాతీలు చేయిస్తున్న ప్రిన్సిపల్ విజయసాయిరెడ్డి, హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ గురుకులాన్ని గిరిజన నాయకులు సందర్శించిన క్రమంలో పిల్లల చేత చపాతీలు చేయించడాన్ని గమనించి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉదయం ఆలస్యంగా పిల్లలకు టిఫిన్ పెట్టడాన్ని తప్పుపట్టారు.
సరైన సమయంలో పిల్లలకు భోజనం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నంలో రాళ్లు వస్తున్నాయని ఆరోపించారు. అరటి పండ్లు, గుడ్లు ఇవ్వడం లేదని, నీళ్ల చారు, పురుగుల అన్నం పెడుతున్నారని హాస్టల్లోని పిల్లలు వాపోతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకోవడానికి గురుకులానికి వస్తే.. వారి చేత పనులు చేయించడం సరికాదని గిరిజన అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరన్న నాయక్ అన్నారు. పిల్లలు ఎవరు కూడా పనులు చేయవద్దని.. చక్కగా చదువుకోవాలని ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వెంటనే ఎస్టీ గురుకులం ప్రిన్సిపల్, వార్డెన్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.