వారికి ఓటేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లే: రేవంత్ రెడ్డి
🎬 Watch Now: Feature Video
ఫిబ్రవరి 6న రేవంత్ రెడ్డి ప్రారంభించిన 'హాథ్ సే హాథ్ జోడో యాత్ర' ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలు, కార్నర్ మీటింగ్స్ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని రేవంత్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ప్రజా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్తున్నారు. పవిత్రంగా భావించే అమర వీరుల స్తూపం నిర్మాణంలోనూ అవినీతి పెచ్చు మీరిందని రేవంత్ అంటున్నారు. బంగాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులనే బీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణలో సృష్టిస్తున్నారని.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను వీరు నియమించుకొని ప్రజల మధ్య వైషమ్యాలను పెంచడానికి ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు బీజేపీకి ఓటేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయితుందని రేవంత్ తెలిపారు. ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని.. వచ్చే ఎన్నికల్లో విజయం హస్తానిదే అని ఆయన స్పష్టం చేశారు.