Rajaiah Comments on Kadiam Srihari : 'కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్‌కౌంటర్ల సృష్టికర్త' - Rajaiah Fires on Kadiyam Srihari
🎬 Watch Now: Feature Video
Rajaiah Fires on Kadiyam Srihari : వరంగల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్లో మరోసారి వర్గపోరు బహిర్గతమైంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పించారు. కడియం శ్రీహరిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో పార్టీ నిధులతో దొంగ చాటుగా సమావేశాలు నిర్వహించి ప్రొసీడింగ్ కాపీలు అందించడం సరికాదని చెప్పారు. నియోజకవర్గానికి వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యేను గౌరవించాలని రాజయ్య హితవు పలికారు.
కానీ కడియం శ్రీహరి.. ఎవరిని కలుపుకొని పోకుండా ఒంటెద్దు పోకడలతో.. నియోజకవర్గ ప్రజలను దూరం పెడుతున్నారని రాజయ్య ఆరోపించారు. కడియం దేవాదుల సృష్టికర్త కాదని.. ఎన్‌కౌంటర్ల సృష్టికర్తని విమర్శించారు. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ఎన్‌కౌంటర్లు జరిగాయని దుయ్యబట్టారు. తనపై ఇష్టానురీతిగా అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏదీ ఏమైనా నియోజకవర్గ ప్రజలు తనవైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి వెంట ఉన్న నాయకులు తన అనుచరులేనని రాజయ్య పేర్కొన్నారు.