ఉదయం 7.30కే ఆఫీస్కు ముఖ్యమంత్రి.. ఇకపై ఉద్యోగులందరికీ అవే టైమింగ్స్! - భగవంత్ మాన్ టైమింగ్స్
🎬 Watch Now: Feature Video
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. మంగళవారం ఉదయం 7.30కే తన కార్యాలయానికి చేరుకున్నారు. తన కుర్చీలో ఆసీనులై.. పలు పత్రాలపై సంతకాలు చేశారు. అయితే అంత పొద్దున్న కార్యాలయానికి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారంటే?
రాష్ట్రంలో మే 2వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త టైమింగ్స్ అమల్లోకి వచ్చాయి. ఉదయం 9 నుంచి 5.30 వరకు బదులు.. 7.30 నుంచి 2.00 వరకే అధికారులు పనిచేయనున్నారు. జులై 15 వరకు కొత్త టైమింగ్స్ అమల్లో ఉండనున్నాయి. విద్యుత్ ఆదాతో పాటు అనేక ప్రయోజనాల నిమిత్తం పంజాబ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త టైమింగ్స్ ద్వారా రెండున్నర నెలల వ్యవధిలో రూ. 40-42 కోట్ల ఆదా అవుతుందని సీఎం మాన్ అంచనా వేశారు.
"కొత్త టైమింగ్స్ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు ఉద్యోగులతో పాటు ప్రజలతో మాట్లాడాం. అందరూ అంగీకరించారు. అందుకే ఈ నిర్ణయాన్ని రెండున్నర నెలల పాటు అమలు చేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటలకు మూసివేస్తే రోజుకు దాదాపు 350 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా విద్యుత్ బిల్లులపై నెలకు రూ.16-17 కోట్లు ఆదా అవుతుంది. ఉదయం 7.30 గంటలకే కార్యాలయాలు తెరిస్తే.. ప్రజలు కూడా ఉదయాన్నే తమ పనులను పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత వారి మిగతా పనులు చూసుకోవచ్చు" అని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చెప్పారు.
"ఆఫీసుల కొత్త టైమింగ్స్.. దిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో అమలు చేయాలి. అప్పుడు ట్రాఫిక్ సమస్యలు కూడా తీరతాయి. అయితే జులై 15 తర్వాత ఈ కొత్త సమయ వేళలపై మరోసారి సమీక్ష నిర్వహిస్తాం. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం" అని మాన్ తెలిపారు.