Palem Canal Gandi At Mulugu : జోరువానలతో తడిచి ముద్దవుతున్న ములుగు ఏజెన్సీ.. వరద ఉద్ధృతికి పాలెం వాగుకు గండి - Flood in Mulugu Agency
🎬 Watch Now: Feature Video
Palem canal Gandi at Venkatapuram Mulugu : రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న జోరు వానాలతో ప్రజలు తడిచి ముద్దవుతున్నారు. ములుగు జిల్లాలో గత మూడురోజులుగా పడుతున్న ఎడతెరపని వర్షాలకు వాగులు వంకలు పొంగుపొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తోన్న భారీ వరదకు జిల్లాలోని వెంకటాపురం మండలం చిన్నగంగారం వద్ద పాలెం వాగుకు గండి పడింది. మధ్యతరహా జలాశయం ప్రధాన కాలువగా చెప్పుకున్న ఈ వాగుకు గండి పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు పంటపొలాల్లో ప్రవహించడంతో ఇసుక మేట వేసింది. ఛత్తీస్గఢ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యతరహా జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ముందు జాగ్రత్తగా జలాశయం నుంచి సుమారు 6,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు. మరోపక్క గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న తిప్పాపురం, పెంకవాగు, కలిపాక, మల్లాపురం, రాజపల్లి గ్రామాల ప్రజారవాణా నిలిచిపోయింది. దీంతో ప్రజలు నిత్యవసర సరుకులు తెచ్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.