Musi Project Water Level : మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద.. 4 గేట్లు ఎత్తి నీటి విడుదల
🎬 Watch Now: Feature Video
Musi Project 4 Gates Lifted : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు హైదరాబాద్ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నల్గొండ జిల్లా కేతెపల్లి మండలం వద్ద మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో గరిష్ఠ నీటిమట్టం 645 అడుగులకు గానూ.. 642.20 అడుగులకు చేరింది. ఈ క్రమంలోనే నీటి పారుదల శాఖ అధికారులు 4 గేట్లను రెండు ఫీట్ల మేర పైకెత్తి.. దిగువకు 4,977 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువ నుంచి 141 క్యూసెక్కులు.. కుడి కాలువ నుంచి 94 క్యూసెక్కుల నీటిని రైతుల పంట పొలాలకు విడుదల చేశారు. మూసీ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మరోవైపు మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుడటంతో.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వలిగొండ మండలం సంగం పరిధిలో మూసీ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బొల్లేపల్లి-చౌటుప్పల్ మార్గంలో రాకపోకలను అధికారులు నిలిపేశారు. రుద్రవెల్లి వద్ద కాజ్‌వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పోచంపల్లి-బీబీనగర్ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.