కాళేశ్వరం స్కామేశ్వరంగా మారిపోయింది - బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ వెళ్తోంది : లక్ష్మణ్ - laxman on kaleshwaram
🎬 Watch Now: Feature Video
Published : Dec 30, 2023, 5:01 PM IST
MP Laxman Fires On Congress Government : బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం స్కామేశ్వరంగా మారిపోయిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం నిర్మాణంలో అనేక తప్పిదాలు, పొరపాట్లు జరిగాయని ప్లానింగ్, డిజైన్‌కు విరుద్దంగా నిర్మాణం జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టు వైఫల్యానికి గత ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలే కారణమన్న ఆయన, రాష్ట్ర సంపదంతా దోపిడీకి గురైందన్నారు. కాళేశ్వరంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని నిలదీశారు. కాళేశ్వరం, మేడిగడ్డ ఘటనల్లో ఏ ఒక్కరిపై చర్యలెందుకు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.
గతంలో ఈ విషయంలో సీబీఐ విచారణ కోరిన రేవంత్ రెడ్డి, ఇప్పుడెందుకు వారి విచారణపై నోరు మెదపడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ప్రజల కళ్లల్లో మట్టి కొట్టేందుకు చూస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ వెళ్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని, లేదంటే కాంగ్రెస్‌ను కూడా ప్రజలు దోషిగా నిలబెడతారని జోస్యం చెప్పారు.