'కాళేశ్వరం' అంశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారు - బాధ్యులపై చర్యలు తప్పవు : జీవన్‌రెడ్డి
🎬 Watch Now: Feature Video
MLC Jeevan Reddy on Millers Frauds in Telangana : బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి మాట్లాడిన ఆయన, సెక్యూరిటీ లేకుండా ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించారని మండిపడ్డారు. రూ.20 వేల కోట్ల విలువైన ధాన్యం మిల్లర్లకు అప్పగించారన్న ఆయన, ధాన్యం సేకరణ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మిల్లర్లు ఆడించిందే ఆట, పాడించిందే పాట అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతి మిల్లరు దాదాపు రూ.4 కోట్ల విలువైన ధాన్యాన్ని అమ్ముకున్నారని విమర్శించారు. తెలంగాణ హక్కులను కేసీఆర్ పరిరక్షించలేకపోయారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు దోషులను ఉరి తీయాలని జీవన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ లీడర్లు ప్రాజెక్టుల డిజైన్ చేస్తే ఇలానే అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంతో గొప్పగా ప్రచారం జరిగిందని, ఇవాళ అదే ప్రాజెక్టులో నాణ్యత ప్రమాణాలు లోపించడంతో దేశంలో తెలంగాణ తలదించుకునే పరిస్థితికి వచ్చిందని మండిపడ్డారు. దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారని, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.