Minister Prashant Reddy : కేంద్రం నుంచి పరిహారం ఇప్పించాకే.. పొలాల్లోకి అడుగుపెట్టండి - Nizamabad District News
🎬 Watch Now: Feature Video
Minister Prashant Reddy on crop loss in Nizamabad : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎకరాకు 10వేల రూపాయల పరిహారం ఇప్పిస్తానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అదే విధంగా రాష్ట్ర బీజేపీ నాయకులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 10వేల రూపాయలు ఇప్పించగల సత్తా ఉందా …? అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.
ప్రకృతి వైపరీత్యాలు తలెత్తి పంట నష్టపోతే.. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు రైతులపై సానుభూతి చూపిస్తూ ముసలి కన్నీరు కార్చకుండా.. కేంద్రం నుంచి ఎకరాకు పదివేల చొప్పున పరిహారం ఇప్పించగలిగితేనే బీజేబీ నాయకులు పంటలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. కేేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎకరాకు చెరో పదివేల పంట పరిహారం ఇచ్చినట్లయితే.. రైతుకు కొద్దిమేర మేలు కలుగుతుందని అన్నారు. తడిసి రంగు మారిన ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కేంద్రం కొనుగోలు చేయట్లేదని మండిపడ్డారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.