ప్రజా పాలన తెచ్చుకోవడంలో సింగరేణి కార్మికుల పాత్ర ప్రధానం : మంత్రి పొంగులేటి
🎬 Watch Now: Feature Video
Minister Ponguleti in Singareni Election Campaign : రాష్ట్రంలో ప్రజా పాలన తెచ్చుకోవడంలో సింగరేణి కార్మికుల పాత్ర ప్రధానమని, రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం మణుగూరులో పర్యటించారు. ఓసీ 2 గని ఆవరణలో జరిగిన సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం కార్మికుల సమస్యలను తెలుసుకోలేదని ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వ వ్యతిరేకత బయటపడిందని గుర్తింపు సంఘం ఎన్నికలను కూడా వాయిదా వేసిందని అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.
సింగరేణి కార్మికులు కోరుతున్న పలు డిమాండ్లను నెరవేర్చుతామన్నారు. ఓటు వేయాలని కార్మికుల దగ్గరకు వస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, ఏఐటీయుసీ సంఘాలను నమ్మొద్దన్నారు. పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్టులతో కలిసి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశామని సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలని ప్రతిపాదించిన కమ్యూనిస్టులు సున్నితంగా తిరస్కరించాలని గుర్తు చేశారు. సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించి కార్మికుల సమస్యలను పరిష్కరించేది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. కార్మికులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మాణం చేపట్టేందుకు, సింగరేణి ఆవిర్భావ దినోత్సవం కార్మికులకు సెలవు మంజూరు చేసేలా ఆదేశిస్తామన్నారు. కార్మికులకు అండగా ఉండే ఐఎన్టీయూసీ గుర్తింపు సంఘాన్ని ఎన్నికల్లో గెలిపించాలన్నారు.