కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే ఆగం అవుతాము : కేటీఆర్ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 26, 2023, 8:01 PM IST
Minister KTR Roadshow in Yellareddypet : కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లే దర్శనమిచ్చాయని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఎల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. నేడు బీఆర్ఎస్ హయాంలో రైతులకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలో ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయ్యాలని ప్రజలను కోరారు.
BRS Election Campaign : బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాగానే మహిళలకు సౌభాగ్యలక్ష్మి పేరిట నెలకు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ హామీ ఇచ్చారని.. ఎవరికైనా రూ.15 లక్షల నగదు ఖాతాల్లో జమ అయ్యాయా? అని అక్కడి ప్రజలను అడిగారు. సీఎం కేసీఆర్.. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.70 వేల కోట్ల నగదు జమ చేసినట్లు పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్నబియ్యం, రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కరెంట్, నీళ్లు ఇవ్వని పార్టీ కాంగ్రెస్ అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు రూ.200 పింఛన్ ఉండేదని.. నేడు రూ.2 వేలకు పెంచినట్లు తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు వచ్చి రూ.4 వేలు పింఛన్ ఇస్తామని మాయమాటలు చెబుతున్నారని.. ఆ నేతల మాటలు నమ్మితే ఆగం అవుతామని స్పష్టం చేశారు.